హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి ఏం ఉద్ధరించారని వరంగల్‌లో రైతుమేళా పెట్టారు. బోనస్ ఎగ్గొట్టినందుకా? రైతు భరోసా వేయనందుకా? పండించిన పంటలు కొనుగోలు చేయనందుకా? అని ప్రశ్నలు సంధించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అలవిగాని హామీలిచ్చి అన్నదాతను మోసం చేశారని విమర్శించారు. దమ్ముంటే కొనుగోలు కేంద్రా ల్లో ఏర్పాటు రైతుమేళాలు పెట్టాలని సవాల్ విసిరారు. రైతుల ఇబ్బందులు తీర్చమని అడిగిన కేటీఆర్‌పై మంత్రులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
రైతుల ఆవేదనను చూసి గుండె తరుక్కుపోయిన కేటీఆర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అక్రమ కేసులు బనాయించడం శోచనీయమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అనేక సభలు, సమావేశాల్లో కేసీఆర్, కేటీఆర్‌పై బూతులు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్నికేసులు పెట్టాలని ప్రశ్నించారు. గూండాగిరీతో బీఆర్ఎస్ గొంతు నొక్కలేరని స్పష్టంచేశారు. ఎన్ని ఇబ్బందులెదురైనా రైతుల పక్షాన గొంతెత్తడం ఆపబోమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల క్యాంపు కార్యాలయం, కౌశిక్‌రెడ్డి వాహనంపై బీజేపీ గూండాల దాడిని ఆయన ఖండించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వరంగల్ రైతు సంగ్రామ సభ సక్సెస్‌ను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో రాజులా బతికిన రైతులు.. రేవంత్ పాలనలో అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు కోసి నెల దాటినా కనీసం 17 శాతం కూడా కొనుగోలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దమ్ముంటే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌పై వరంగల్ వీధుల్లో చర్చకు సిద్ధమా? లేదంటే ఢిల్లీకి రమ్మంటావా? అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా రైతు డిక్లరేషన్ అమలుచేసే దిశగా రేవంత్‌రెడ్డికి ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. వరంగల్ సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ నేతలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రైతుమేళాకు రైతులు కరువయ్యారని, కానీ బీఆర్ఎస్ పెట్టిన సంగ్రామ సభకు పోటెత్తారని గుర్తుచేశారు. రైతుల బాధలు తెలియని నాయిని రాజేందర్‌రెడ్డి, రోడ్లపై తిరిగే అద్దంకి దయాకర్ నోటికొచ్చినట్టు దూషణలకు దిగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాజేందర్.. చిత్తశుద్ధి ఉంటే రైతుల కన్నీళ్లు తుడువాలని హితవుపలికారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ సంగ్రామ సభ సూపర్ హిట్ అయింది.. కానీ బస్సులు పెట్టి రైతుల ముసుగులో కార్యకర్తలను తరలించినా రైతుమేళా అట్టర్ ఫ్లాప్ అయింది’ అని వ్యాఖ్యానించారు. సంగ్రామ సభలో కేటీఆర్ లెవనెత్తిన ప్రశ్నలకు జవాబుచెప్పలేని కాంగ్రెస్ దద్దమ్మలు నోటికొచ్చినట్లు మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. పంటలను కొనేవారే లేరని ఆవేదన వ్యక్తంచేశారు.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. కేటీఆర్ ఉన్న మాటంటే ఉలుకెందుకు సీతక్కా? అని ప్రశ్నించారు. జాతర టెండర్లలో కమీషన్లపై సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు వాగడం సిగ్గుచేటన్నారు. ‘బిడ్డా అద్దంకి దయాకర్.. ఉద్యమనేత కేటీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతవా? ఆయన పుట్టుక గురించి వాగుతవా? సిగ్గు లేదా నీకు? మీ అమ్మ దగ్గరికి వెళ్లి ఇలా మాట్లాడిన అని చెప్పు, నీ దవడ పగులడం ఖాయం.. పిచ్చికూతలు కూస్తే నీ తోలు తీస్తం అని హెచ్చరించారు.