జనగామ, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను శనివారం పోలీసులు అరెస్టు చేయడంతో స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో ధృవ వెంచర్ వ్యవహారంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని ప్రత్యర్థులను బెదిరించి కిడ్నాప్ చేశారు. దీన్ని ఎత్తిచూపిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇద్దరిపై కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. దీంతో ఎర్రబెల్లికి ఏసీపీ నర్సయ్య నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి బీఆర్ఎస్ నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని ఎర్రబెల్లి పోలీసులను నిలదీశారు. బాధితుడు పోస్టు ద్వారా ఆధారాలు పంపినా ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో ఎర్రబెల్లిని ఫోన్లో మాట్లాడించారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి పిటిషన్‌పై సోమవారంలోగా కేసు నమోదు చేస్తామని డీసీపీ హామీ ఇవ్వడం, ఆ వెంటనే వరంగల్ సీపీ అంబర్ కిశోర్‌ఝా సైతం దయాకర్‌రావుకు ఫోన్‌చేసి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ పేరిట రాసిన ఫిర్యాదును ఎర్రబెల్లి సమక్షంలో పార్టీ శ్రేణులు ఎస్సై సృజన్ కుమార్‌కు అందజేశారు.