దేవరుప్పుల, మార్చి 20 : దేవాదుల ప్రాజెక్ట్ మూడు ఫేజ్‌లు సంవత్సరం పొడవునా పంపింగ్ జరిగేలా కేసీఆర్ హయాంలో నిర్మిస్తే, ఆ నీటిని ఎలా వాడుకోవాలో తెలియని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష నిర్వహించగా, ఎర్రబెల్లి హాజరై మాట్లాడారు. టీడీపీ హయాంలో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లు పనులు చేయలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ తిరిగి ఆ ప్రాజెక్టును ప్రారంభించడమేకాక పూర్తి చేసినట్టు చెప్పారు. దాని ఆయకట్టు పనులు 15 నెలలుగా పెండింగ్‌లో పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు.. ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా నడిపితే సాగునీటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. దేవాదుల మోటర్లకు బిల్లులు చెల్లించడంలేదని, దేవన్నపేట వద్ద ఉన్న భారీ సామర్ధ్యం గల పంప్‌హౌస్ మోటర్లు ఎలా పనిచేస్తాయో తెలియని మంత్రులు రైతులకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు.
గాలిమోటర్ మీద వెళ్లి మోటర్ ఆన్ చేస్తే నడుస్తాయా? అని ఎద్దేవా చేశారు. ఈ మోటర్లను ఆన్ చేయడానికి సాంకేతిక నిపుణులు ఆస్ట్రియా నుంచి రావాల్సి ఉండగా, మంత్రులు హడావిడిగా వెళ్లి మ్యానువల్‌గా ఆన్ చేస్తే పంపింగ్ వ్యవస్ధ దెబ్బతింటుందని అధికారులు చెబితే వెనుదిరిగినట్టు పేర్కొన్నారు. ఇలా ప్రజాధనాన్ని వృథా చేయడం, కాలయాపన చేయడం మానుకోవాలని సూచించారు. దేవాదుల ఫేజ్-1 ద్వారా 5.18 టీఎంసీలు, పేజ్-2 ద్వారా 7.25 టీఎంసీలు, ఫేజ్-3 ద్వారా 25.75 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్నా, ప్రభుత్వ నిర్వాకం వల్ల పంపులను బంద్పెట్టారని విమర్శించారు. దేవాదుల ద్వారా వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు నీరందించేలా కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయగా, నేడు కాల్వల్లో తుమ్మలు మొలుస్తున్నాయని మండిపడ్డారు. దేవాదుల మూడో దశలో రూ.1,494 కోట్లలో రామప్పచెరువు నుంచి ఉనికి చెర్లకు టన్నెల్, దేవన్నపేట వద్ద పంప్‌హౌస్ పనులు కేసీఆర్ పూర్తి చేస్తే, ఇవి కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం చేతకాని తనం, వైఫల్యం కారణంగా ఇప్పటికే 454మంది రైతులు అసువులుబాసినట్టు తెలిపారు.