ఎల్కతుర్తి, ఏప్రిల్ 10: ‘సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి.. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డాడే తప్ప ఏనాడూ ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేయలేదు‘ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణాన్ని గురువారం ఆయన ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ .. 16 నెలల్లోనే రేవంత్‌రెడ్డి పాలన అట్టర్‌ఫ్లాప్ అయిందని, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడితేనే తెలంగాణ సిద్ధించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలు మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని వివరించారు.
కాంగ్రెస్ మోసాలను వివరించి ప్రజలను జాగృతం చేయడానికే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా భారీ బహిరంగ నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ సభకు 11లక్షల వరకు ప్రజలు తరలివచ్చే ఆస్కారముందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవారెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్ పాల్గొన్నారు.