కొడకండ్ల, ఫిబ్రవరి 11 : మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలనున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేక లోలోపల కుమ్ములాటలు జరుగుతున్నట్టు తెలిపారు. ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోయి సీఎం మార్పు జరగవచ్చని పేర్కొన్నారు. వివిధ రాష్ర్టాలతోపాటు ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమితో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోయిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని స్పష్టంచేశారు. 50 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని కోరుతూ ఈ నెల 8న కొడకండ్లలో మొదలుపెట్టిన నిరాహార దీక్షను మంగళవారం ఎర్రబెల్లి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1995 తర్వాత ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.