Errabelli Dayakar Rao | పాలకుర్తి రూరల్, నవంబర్ 9: ఓటుకు నోటు కేసులో డబ్బు సూట్‌కేసుతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అడ్డంగా దొరికిపోయి, ఇప్పుడు నీతులు చెప్తూ.. ఇతరులపై నిందలేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ బ్రోకర్, జోకర్ అని, ఆయన బ్లాక్మెయిల్ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆయన రేవంత్‌రెడ్డి కాదని, రేటెంతరెడ్డి అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్న చరిత్ర రేవంత్‌దని ధ్వజమెత్తారు. కొడంగల్‌లో ఓడిపోయిన వ్యక్తి పాలకుర్తిలో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
‘హెలికాప్టర్లో వచ్చే బతుకా నీది? బాబ్లీ కోసం నేను, టీడీపీ ఎమ్మెల్యేలు పోరాటం చేసి జైలుకు వెళ్తే రేవంత్‌రెడ్డి తప్పించుకొన్నాడు. తెలంగాణ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, బాబు చెప్పిన మాటలు విని పారిపోయాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే గుణపాఠం తప్పదు’ అని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి తన గురించి మాట్లాడటం తగదని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ప్రజల మద్దతుతో ఏడు సార్లు గెలిచానని, కాంగ్రెస్ గాలిలోనూ ఎన్నికైనట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ మాదిరిగా వరుసగా గెలిచిన ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. తనకు వందల ఎకరాల ఆస్తి ఉన్నదని, 250 ఎకరాల భూమిని రామకృష్ణ మఠానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్కుటుంబ చరిత్ర తనకు తెలుసని అన్నారు. వాల్ పెయింటర్, ప్రింటింగ్ ప్రెస్ నుంచి రూ. లక్షల కోట్లు ఎలా సంపాదించావు? అని ప్రశ్నించారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.