పెద్దవంగర/పాలకుర్తి, జూలై 10 : రాష్ట్రంలో సాగేది ప్రజాపాలన కాదని.. ప్రజలను దోచుకునే పాలన అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల వల్ల ప్రజలు మోసపోయారని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా నిధులను విడుదల చేసిందని, ఇందిరమ్మ ఇండ్లతో కాంగ్రెస్ నాయకులకే లబ్ధి జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 శాతం సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా పాకనాటి రఘువీరరెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరగా ఎర్రబెల్లి కండువా కప్పి ఆహ్వానించారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఏపీవోగా విధులు నిర్వర్తిస్తూ పనిఒత్తిడితోపాటు మూడు నెలలుగా జీతాలు రాక మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన కమ్మగాని శ్రీనివాస్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.