పాలకుర్తి, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ పాలనలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, ఆ పార్టీ వచ్చి కరువును తెచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో దేవాదుల 4ఎల్ కాల్వ ద్వారా గోదావరి జలాలు రావడం లేవని రైతులు ఎర్రబెల్లి దృష్టికి తీసుకురాగా పరిశీలించారు. దేవాదుల శాఖ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి మూడు రోజుల్లో నీళ్లు వదలాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో చెరువులు మత్తళ్లు దూకాయని గుర్తుచేశారు. ప్రస్తుత సర్కారు గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో 1000 ఎకరాల్లో వరి పొలం ఎండుతున్నదన్నారు. మూడు రోజుల్లో గోదావరి జలాలు విడుదల చేయకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు వరి వేయవద్దు అని చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో బోర్లు, బావుల్లో భూ గర్భ జలాలు అడుగంటడడంతో పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు.