వర్ధన్నపేట, జనవరి 22: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని భారతీయ నాటక కళాసమితి ఆవరణలో గురువారం జరిగిన మున్సిపాలిటీ పట్టణ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. అందుకని గ్రామాలతోపాటు పట్టణ ప్రజలు కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.