రాయపర్తి/తొర్రూరు/పెద్దవంగర/దేవరుప్పుల, మే 7 : పరిపాలనా అనుభవంలేని రేవంత్‌రెడ్డి తెలంగాణ అప్పులకుప్పగా మారిందని చెబుతూ ప్రపంచస్థాయిలో రాష్ట్రం పరువును గంగలో కలుపుతున్నాడని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగరలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి చేతగాని మాటలవల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకురావడంలేదని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని పాలించడం చేతగాని రేవంత్‌రెడ్డి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. పెద్దవంగరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మరోవైపు పహల్గాంలో పాకిస్థాన్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్న మృతుల ఆత్మకు ఆపరేషన్ సిందూర్‌తో శాంతి కలిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
జనగామ జిల్లా దేవరుప్పులలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రపంచదేశాల మద్దతు కూడగట్టిన ప్రధాని మోదీకి రాజకీయాలకతీతంగా దేశం మద్దతుగా నిలుస్తున్నదని చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లకు సెల్యూట్ చేశారు.