పెద్దవంగర, ఆగస్టు 21: రుణమాఫీ 40 శాతం మందికే జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని.. రేవంత్‌రెడ్డి పుటకోమాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రుణమాఫీకి రూ.49 వేల కోట్లని చెప్పి.. 17 కోట్లతో సరిపెట్టడం దారుణమని అన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని మంత్రులు చెప్తున్నా రేవంత్ చెవికెక్కడం లేదని, అయినా పూర్తిస్థాయిలో జరిగిందని ఖమ్మం సభలో ప్రకటించడం ఆయన తెలివితకువతనానికి నిదర్శనమన్నారు. సీఎంకు దేవుళ్ల మీద ఒట్లు తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. హరీశ్‌రావు సవాల్ భయంతోనే కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను మొదలు పెట్టిందని తెలిపారు.
ధర్నా అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులతో కలిసి స్థానికంగా ఉన్న ఎస్బీఐకి వెళ్లి అకడి అధికారులను కలిసి రుణమాఫీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దవంగర బ్యాంకులో మొత్తం 1,900 మంది రైతులు రుణాలు తీసుకుంటే..800 మందికే రుణమాఫీ జరిగిందని.. రూ.25 కోట్లకు రూ.9 కోట్లే మాఫీ అయిన విషయాన్ని గుర్తించారు. 40 శాతానికి మించి రైతులకు రుణమాఫీ కాలేదనే విషయాన్ని స్వయంగా బ్యాంకర్లే చెబుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.