పర్వతగిరి ఏప్రిల్ 7: గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా కదిలిరావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరుగునున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ముందు చూపుతో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే, ఈ ప్రభుత్వం కనీసం బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఉందన్నారు. మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు గుర్తించారని, వారిని మరింత చైతన్యవంతం చేసి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శ్రేణులంతా ఐక్యత తో ముందుకు రావాలని చెప్పారు.
సీపీఎం కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సీపీఎం కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి స్థానం కల్పించారు. తమిళనాడులోని మదురైలో సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు ఎస్ వీరయ్య, టీ జ్యోతి, సాయిబాబుకు అవకాశం లభించింది. గత కమిటీలో తెలంగాణ నుంచి నలుగురు ఉండగా ఈ సారి వారి సంఖ్య ఐదుకు పెరిగింది. ఎస్ వీరయ్య, జ్యోతి ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. సాయిబాబు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కోశాధికారిగా కొనసాగుతున్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరోలో ఏపీ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. ప్రస్తుత పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులుతోపాటు, అరుణ్‌కుమార్‌ను చేర్చుకున్నారు. అరుణ్‌కుమార్ 1998 నుంచి 2002 వరకు ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.