హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ‘మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన. బిట్స్‌పిలానీ గోల్డ్మెడలిస్ట్ను. మేనేజ్మెంట్, ఎకనామిక్స్‌లో రెండు పీజీలు చేసిన. అమెరికాలో ఏడేండ్లపాటు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన. ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేను పట్టభద్రుల తరఫున ప్రశ్నించే గొంతుకనవుతా’ అంటున్నారు వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి. ఉన్నత విద్యావంతుడిగా తనను పట్టభద్రులు గుర్తించి ఆశీర్వదిస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తానే బెస్ట్ చాయిస్ అన్న నిర్ధారణకు వచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళి, పట్టభద్రుల స్పందన తదితర అంశాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శాసనమండలిలో మీరులేవనెత్తాలనుకునే అంశాలేంటి?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. వాటిల్లో ప్రధానమైంది జాబ్‌క్యాలెండర్. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ, ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఇలా అనేక హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆర్నెళ్లు అవుతున్నా వందరోజుల్లో జాబ్ క్యాలెండర్ అనేది అమలు కాలేదు. ఈ హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించటం లేదు. అతిముఖ్యమైన అంశాలే కాదు సాధారణ అంశాలపైనా కాంగ్రెస్ సర్కారుకు అసలు ఎజెండాయే లేదని ప్రజలు గుర్తించారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికలంటే ప్రచారపటాటోపం ఉండదు కదా. మరి మీ కార్యాచరణ ఎట్లా ఉంది?
నిజమే. సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదీ పట్టభద్రుల ఎన్నిక విధానం పూర్తిగా భిన్నమైంది. ఈ కారణంగా ప్రతి ఓటర్ను కలిసి మద్దతు కోరుతున్నాం. సోషల్ మీడియాను వాడుకుంటూనే వివిధ సంఘాల ప్రతినిధులను కలుస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను కలుస్తున్నాం. మొత్తంగా చూస్తే ఎన్నికల కమిషన్ ఫార్మాట్లో రిజిస్టర్ అయిన ప్రతి ఓటరును కలిసి అందరి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకర్గంలో ఇప్పటివరకు ఓటర్లతోనే సమమావేశాలు నిర్వహించాం.
ఐదునెలలు కాకముందే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చెప్తున్నది కదా?
బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో నోటిఫికేషన్లు విడుదల చేసి, ఎంపిక ప్రక్రియ అంతా పూర్తిచేసి నియామక పత్రాలు జారీ చేసే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. అన్ని ప్రక్రియలు పూర్తిచేసిందెవరు? కేవలం ఉద్యోగ నియామక పత్రాలిచ్చి మొత్తం మేమే ఇచ్చామని ఫోజులు కొడ్తున్నదెవరో అందరికీ తెలుసు. తొమ్మిదిన్నరేండ్లలోనే దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వమన్న సంగతి ఆ ఉద్యోగాలు చేస్తున్నవారికి, వారి కుటుంబాలకు తెలుసు. కేసీఆర్ ప్రభుత్వమిచ్చిన ఉద్యోగాలను తాము భర్తీ చేశామని చెప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.
ప్రచారంలో పట్టభద్రుల స్పందన ఎలా ఉంది?
చాలా అద్భుతంగా ఉంది. బరిలో ఉన్న మూడు రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి బెస్ట్ చాయిస్ అనే అభిప్రాయం పట్టభద్రుల్లో కనిపిస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎంపిక విషయంలో ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. మల్లన్న వ్యవహారశైలి, నోటిదురుసు ఇతరేతర అంశాల కారణంగా కాంగ్రెస్‌లోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇక బీజేపీలో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఆ పార్టీలో అసలు అభ్యర్థిగానే గుర్తించటం లేదు. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా బీఆర్ఎస్కే సానుకూల పరిస్థితి ఉన్నది. మూడు ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాం. పూర్తిస్థాయిలో పట్టభద్రులైన ఓటర్లు హాజరై నన్ను దీవిస్తున్నారు. ఈ మూడు జిల్లాలు తెలంగాణ ఉద్యమానికే కాకుండా సాయుధరైతాంగ పోరాటానికి, వామపక్ష, ప్రగతిశీల భావజాలానికి పెట్టనికోటలు. ఈ కారణంగానే నాలుగుసార్లు బీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించింది. ఐదోసారి ఆ చరిత్ర పునరావృతమవుతుందనే విశ్వాసంతో ఉన్నా.
బీఆర్ఎస్ అభ్యర్థిగా మీకు కలిసివచ్చే అంశాలేంటి?
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సమస్త గులాబీ సైనికుల దీవెనలే నా బలం. పార్టీలో ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థులుగా భావించి నా గెలుపుకోసం కష్టపడుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మాతృభూమికి సేవ చేయాలనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సమస్యలు, తెలంగాణ, భారతదేశ ఆర్థిక స్థితిగతులపై నాకు సంపూర్ణ, సమగ్ర అవగాహన ఉన్నది. ‘ప్రగతి రథచక్రాలు’, ‘ఫిసల్ ఫెడరలిజం’, ‘ద డాన్ ఆఫ్ న్యూ ఎరా’, ‘తెలంగాణ ఎకానమీ’ వంటి పుస్తకాలు రాశా. సివిల్స్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు గెస్ట్ లెక్చర్లు ఇచ్చా. ‘ఈ-క్లాసెస్’ అనే ఫ్రీ కోచింగ్ యాప్ రూపొందించి ఉచితంగా ఉద్యోగార్థులకు అందుబాటులోకి తెచ్చిన. ఇవన్నీ నాకున్న ప్రాథమిక అర్హతలుగా భావిస్తున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలమే అయినా, నా వ్యక్తిగత కార్యదక్షతకు పార్టీ బలంతోడై నన్ను ముందుకు నడిపిస్తున్నది.