Stray Dogs |హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై లెక్కలు సమర్పిస్తే చాలదని, అసలు గణాంకాలే వద్దని, చర్యలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే వీధి కుక్కలు పిల్లలపై పడి కరవడంతో పలువురు చనిపోయారని, ఇంకా ఎంత మంది చనిపోయే వరకు ఆగాలని నిలదీసింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న లెకల వివరాలు ముఖ్యం కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోబోయే చర్యలు ఏమిటో చెప్పాలని స్పష్టం చేసింది. బుధవారం వీధికుక్కల దాడులపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఒక పక పిల్లలు చనిపోతుంటే, తీసుకున్న చర్యలతో కౌంటర్ వేశామంటే ఎలా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది.
జూబ్లీహిల్స్‌లో 350, బంజారాహిల్స్‌లో 250 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని చెప్పి, మళ్లీ అదనపు కౌంటర్ దాఖలు వేసేందుకు తిరిగి గడువు కోరటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. వీధికుక్కల బాధితులు మురికివాడల్లో ఉన్నారని, అధికారులేమో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ధనవంతుల కాలనీల్లో చర్యలు తీసుకుంటే ఎలాగని నిప్పులు చెరిగింది.
కుక్క కాటు ఘటనలు ధనవంతులు కాలనీల్లో జరగటం లేదని, పేదలు నివసిస్తున్న మురికివాడల్లోనే జరుగుతున్నాయని గుర్తుచేసింది. మురికివాడలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని తేల్చిచెప్పింది. అధికారులు ఈ సమస్యను మానవీయకోణంలో చూడాలని, సమస్యకు పరిషారం దిశగా చర్యలు ఉండాలని సూచించింది. ఇదేదో ఒక వ్యవహారంగా పరిగణించవద్దని, తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులు స్పందించాలని స్పష్టం చేసింది.
వారంలోగా జీహెచ్ఎంసీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నామని, అప్పటికి కుక్కల దాడుల నివారణకు తీసుకున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను నివేదించాలని స్పష్టం చేసింది.