కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 2 : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ -నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో మాడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆదివారం కోయిలాబేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పానీదోబిర్ అడవుల్లో భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. కాల్పులు కొనసాగుతున్నట్టు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం వెల్లడించారు. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారనే విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరను జవాన్లు నిర్వీర్యం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సీతాపూర్-ఉసుర్ మార్గంమధ్యలో రోడ్డుని తవ్వి మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. భద్రతాదళాలు గుర్తించి 25కేజీల కంటైనర్‌లో పాతిపెట్టిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని తొలగించారు. ఈ మందుపాతరకు కార్డెక్స్ వైర్‌ను అనుసంధానం చేస్తూ రోడ్డు నుంచి 400మీటర్ల వరకు అమర్చారు. రోడ్డు గుంతలా ఉండడంతో వైరుని గమనించిన జవాన్లు మందుపాతరను జేసీబీతో తవ్వించి, నిర్వీర్యం చేశారు.