ఏటూరునాగారం, డిసెంబర్ 1: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకరపోరు కొనసాగింది. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. రెండు ఏకే 47 తుపాకులతోపాటు మరో ఐదు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కాగా, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన ఏగోలపు మల్లయ్య ఉన్నారు. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు. చెల్పాక పంచాయతీ పరిధిలోని పోలుకమ్మ వాగు గొత్తికోయగూడేనికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం పుల్లలమెద తోగు సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శబరీశ్ పరిశీలించారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా దళ కమాండర్ కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), డివిజన్ కమిటీ సభ్యుడు ఏగోలోపు మల్లయ్య అలియాస్ కోటి (43), ఏరియా కమిటీ సభ్యురాలు ముసకి జమున (23), ఏరియా కమిటీ సభ్యుడు కరుణాకర్ (22) ఉన్నట్టు ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ వెల్లడించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు. పీఎల్జీఏ వారోత్సవాలకు ఒకరోజు ముందు మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ దెబ్బ కోలుకోలేని దెబ్బతగిలింది.
ఏడుగురి మృతి: ఎస్పీ
పోలీసులు చెల్పాక ప్రాంతంలో పోలీసుల పెట్రోలింగ్ చేస్తుండగా, ఉదయం 10 నుంచి 12 మంది మావోయిస్టులు కనిపించారని, పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారని జిల్లా ఎస్పీ శబరీశ్ వివరించారు. అరగంట పాటు కాల్పులు జరిగాయని, తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు గుర్తించామని తెలిపారు. మరికొందరు తప్పించుకుని పారిపోయినట్టు తెలిపారు. తప్పించుకున్న వారు సరెండర్ కావాలని ఆయన కోరారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47, ఒక జీ-3, ఒక 303, ఒక సింగిల్ షాట్, ఒక తపంచా ఉన్నట్టు తెలిపారు. కిట్ బ్యాగులు, సాహిత్యం, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు.
ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హత్యచేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. బీజాపూర్ జిల్లా బైరామ్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దాలేకు చెందిన కామేశ్ కుంజమ్ (25)ను శనివారం రాత్రి సాయుధులుగా వచ్చిన మావోయిస్టులు అపహరించుకెళ్లారు. తర్వాత సదరు యువకుడిని హత్య చేసి, టిండోడి మార్గంలో మృతదేహాన్ని వదిలివెళ్లారు. ‘పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతోనే కా మేశ్ని హత్య చేశాం’ అంటూ మావోయిస్టు పార్టీ బైరామ్‌గఢ్ ఏరియా కమిటీ పేరుతో ఘ టనా స్థలంలో లేఖలను విడిచివెళ్లారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న బైరామ్‌గఢ్ పోలీసులు.. కామేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్కౌంటర్లతో రాష్ట్రంలో అశాంతి : ఎక్స్ వేదికగా హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు బూటకపు వాగ్దానాలు, మరోవైపు బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏడాది పాలన విజయోత్సవాలు నిర్వహించే ఈ తరుణంలో ఈ బూటకపు ఎన్కౌంటర్ ఏంటి? అని ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్కౌంటర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అన్నివర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెకించారని విమర్శించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ఫైరయ్యారు.
విషప్రయోగంతో మట్టుబెట్టారు!పౌరహక్కుల సంఘం
ఏటూరునాగారం లో ఎన్కౌంటర్ జరగలేదని, విషప్రయోగం తో ఏడుగురిని పోలీసులు మట్టుబెట్టారని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న ప్రజాపాలనలో 16 మందిని బూటకపు ఎన్కౌంటర్లలో పొట్టనపెట్టుకున్నారని ఆరోపించిం ది. ఈ మేరకు ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేసింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎన్కౌంటర్ జరిగినట్టు లేదని, పోలీసులెవరికీ గా యాలు కాలేదని పేర్కొన్నారు. అన్నంలో విషం పెట్టి, సృ్పహ కోల్పోయాక చిత్రహింసలు పెట్టి, తుపాకులతో కాల్చి చంపినట్టుగా అకడి గ్రామస్థులు చెప్తున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని వీరితో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ సైతం ప్రకనటలో డిమాండ్ చేశారు. కార్పొరేట్ల కమీషన్లకు సీఎ ం రేవంత్‌రెడ్డి కక్కుర్తి పడుతున్నాడని మావోయిస్టు పార్టీ లేఖలో విమర్శించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీల లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.పర్యావరణాన్ని దెబ్బతీసే గనులను, పర్యాటక కేంద్రాలు, ఫార్మాసిటీ, నేవీ రాడార్ వంటి వినాశకర అభివృద్ధిని తీవ్రతరం చేస్తున్నదని మండిపడ్డారు.