హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండోరోజూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో వాటిని యథావిధిగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేశారు. సమ్మిట్‌లో బలవంతంగా కూర్చున్న విద్యార్థులు చేసేదిలేక ప్రసంగాలను వదిలేసి ఫోన్లలో ముఖాలు పెట్టి రీల్స్ చూడటంలో బిజీ అయ్యారు. ‘ఈ సమ్మిట్‌కు ఎందుకు వచ్చారు?’ అని ఏ విద్యార్థిని పలుకరించినా.. ‘మా సార్లు పంపారు.. మేం వచ్చాం’ అంటూ సమాధానం ఇచ్చారు. అక్కడ గుడారాలు, స్క్రీన్స్‌లు కొత్తగా కనిపించడంతో వాటి దగ్గర ఫొటోలు దిగగా, మరికొందరు అంబటి రాయుడు, గుత్తా జ్వాలతో సెల్ఫీలకు ఫోజు ఇచ్చారు.
హైదారాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిథుల కోసం ఏర్పాటుచేసిన గోల్డెన్పాస్ల జారీ వివాదాస్పదంగా మారింది. సోమవారం రాత్రి నిర్వహించిన గాలా ఈవెంట్‌కు గోల్డెన్ పాస్‌లు ఉన్నా.. వారిని అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. సమ్మిట్ మొదటిరోజున నిర్వహించే గాలా ఈవెంట్‌కు సతీసమేతంగా రావాలని పలువురు ప్రముఖులకు గోల్డెన్ పాస్‌లు జారీ చేశారు. అయితే, సోమవారం రాత్రి అక్కడే ఉన్న కొందరు డెలిగేట్స్ సీట్లలో ఆసీనులవడంతో.. కొంచెం ఆలస్యంగా చేరుకున్న పాస్హోల్డర్లకు సీట్లు దొరకలేదు.
అప్పటికే చాలామంది నిల్చొని ఆ ఈవెంట్‌ను వీక్షిస్తుండటంతో.. ఆ తర్వాత వచ్చిన గోల్డెన్పాస్ హోల్డర్లను వేదికవైపు అనుమతించలేదు. ఆఖరికి ఉన్నతాధికారులు సర్దిచెప్పడంతో సిబ్బంది వారి ని లోపలికి అనుమతించారు. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత సమ్మిట్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అ నుమతించలేదు. ఈ సమయంలో కేవలం గోల్డెన్పాస్లు ఉన్నవారినే అనుమతించాలని ఉన్నతాధికారులు చెప్పారంటూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.