Revanth Reddy | నిర్మల్ అర్బన్/ ఖానాపూర్ టౌన్, జనవరి 16: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా.. 3.38 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సభా వేదికపైకి చేరుకు న్నారు. వచ్చిన కొద్దిమంది కూడా ఆయన ప్రసంగించే సమ యంలో వెనుదిరిగి పోవడం కనిపించింది.
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు అధికారులు దగ్గరుండి జనసమీకరణ చేయడం పలు విమర్శలకు తావిస్తున్నది. భారీ జనసమీకరణ చేయాలనే ఉద్దేశంతో ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది శుక్రవారం ఉదయం నుంచే సభకు ప్రజలను తరలించే వాహనాలకు దగ్గరుంచి డీజిల్ టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్లు పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి సురేందర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సీఎం సభకు వాహనాలకు డీజిల్ పోయిస్తున్నామని.. వివరాలు కమిషనర్‌ను అడగాలని తెలిపాడు. మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్ను వివరణ కోరగా సిబ్బందిని తరలించడానికి టోకెన్లు పంపిణీ చేశామని చెప్పారు.