హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మహాత్మాగాంధీపై కోపంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బిల్లుపై పార్లమెంట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఏకపక్షంగా బిల్లును పాస్ చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించారు. కొత్త పథకం కార్మికులకు అన్యాయం చేసేలా ఉన్నదని, రాష్ట్రాలపై భారం మోపేందుకే దీనిని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రగతిశీల శక్తులు, వామపక్ష పార్టీలు, వ్యవసాయ కూలీ సంఘాలు ఉద్యమించి ఈ బిల్లును వ్యతిరేకించాలని చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.