హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆ పథకం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య మంత్రి సీతక్క ఎదుట వాపోయారు. తమకు ఇచ్చే కొద్దిపాటి జీతాలను క్రమం తప్పకుండా ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.
కొత్త చట్టంతో ఉపాధి హామీ పథకం లక్ష్యాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నదని, ముఖ్యంగా కూలీలకు హామీగా ఉన్న ఉపాధి, వేతన భద్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవోల గౌరవాధ్యక్షుడు మోహన్రావు, అధ్యక్షుడు అంజిరెడ్డి, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, కంప్యూటర్ అండ్ అకౌంట్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, జేఏసీ కో చైర్మన్లు గిరిగౌడ్, రామకృష్ణ, రఘు, గురుచరణ్సింగ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.