Insurance | హైదరాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బతికేందుకు హెల్త్‌కార్డులు ఇవ్వాలంటే.. మరణించాక అందే బీమా ఇస్తామంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మా చావు కోరుకుంటున్నరా? మేం చావాలనుకుంటున్నరా? హెల్త్కార్డులివ్వకుండా.. బీమా ఇచ్చి మమ్మల్ని చంపాలను కుంటున్నారా? అంటూ నిలదీస్తున్నారు. మాలో ఎవరడిగారని ప్రమాద బీమా ప్రకటించారని ఆక్రోశం వ్యక్తంచేస్తున్నారు.
ఇదేం విధానం.. ఇదేం పద్ధతి.. అంటూ సర్కారు తీరును తప్పుబడుతున్నారు. చచ్చిన తర్వాత ఇచ్చేది మాకేందుకు? బతికున్నప్పుడు ఇచ్చే హెల్త్‌కార్డుల గురించి తేల్చండి.. అంటూ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి ఉద్యోగికి 1.2 కోట్ల ప్రమాద బీమాను వర్తింపజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉండగా, ఈ ప్రమాద బీమా 5.14 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకే వర్తిస్తుంది.
మాటిచ్చి ఏడాది దాటినా అతీగతి లేదు
ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీ 2025 సెప్టెంబర్‌లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలతో సెప్టెంబర్ 1న సర్కార్ చర్చలు జరిపింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తించేలా హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఈ చర్చల్లో జేఏసీ డిమాండ్ చేసింది. వారంలో హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేస్తామని ఇదే సమావేశంలో సర్కార్ హామీ ఇచ్చింది. ఈ హామీ నేపథ్యంలో జేఏసీ నేతలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. సరిగ్గా వారం గడిచాక సీఎస్ రామకృష్ణారావు ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కానీ వారం గడిచాక కొత్త కథ తెరపైకి వచ్చింది. ఈహెచ్ఎస్ స్కీంపై ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నిమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో తప్ప ఎక్కడా ఉద్యోగులకు వైద్యమందడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స అందడమే లేదు. వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు 40 మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు.
ఈహెచ్ఎస్ స్కీం అమలుకు నాడు కేసీఆర్ సర్కార్ జీవో
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈహెచ్ఎస్ స్కీం అమలుకు గత కేసీఆర్ సర్కార్ జీవో-186ను జారీచేసింది. ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటుచేసింది. కేవలం ఉద్యోగులు, సర్కారు వాటాను జమ చేయడం, హెల్త్కార్డులివ్వడం మాత్రమే మిగిలింది. ఈలోగా ప్రభుత్వం మారడంతో ఆ జీవో అమలుకాలేదు. గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన జీవోను అమలుచేస్తామని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇస్తామని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు హెల్త్‌కార్డులు ఇవ్వనేలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపితే 7.14 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం ఏటా రూ.1,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అంటే రూ.700 కోట్లు ఉద్యోగులు సమకూర్చనుండగా, సర్కారు రూ.700 కోట్లు సమకూర్చాల్సి ఉన్నది. ఈ మొత్తాన్ని భరిచేందుకు సర్కార్ ముందుకు రావడమే లేదు.
మేం ప్రమాద బీమా అడగలే
మేం హెల్త్‌కార్డులు ఇవ్వాలని అడిగితే ప్రమాద బీమా ఇస్తామంటున్నారు. దాని గురించి మాకు తెలియదు. మాతో చర్చించనూలేదు. జనవరి 1న సీఎం రేవంత్‌రెడ్డిని తాము కలిసినప్పుడు హెల్త్కార్డులివ్వాలనే జేఏసీ పక్షాన కోరాం. దీనిపై అనేక సమావేశాలు కూడా జరిగాయి. కానీ తీరా చూస్తే కొండ నాలుకకు ముందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది మా పరిస్థితి. మేం అడిగింది ఒకటి. సర్కార్ ఇస్తామంటున్నది మరొకటి. ఉద్యోగులంటేనే ఛీప్‌గా చూస్తున్నారు. సీఎం అపాయింట్మెంట్ కోరాం. మంత్రులే కాదు. పీఏలు కూడా మా ఫోన్లు ఎత్తడంలేదు. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఎన్నిసార్లు కలవాలి.
– మారం జగదీశ్వర్,ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
మళ్లీ సర్కార్ కొత్త డ్రామా!
వారం రోజుల్లో హెల్త్కార్డులిస్తామని గతంలో డిప్యూటీ సీఎం ప్రకటించారు. మంత్రులు, జేఏసీ నేతల సమక్షంలో అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై పదిసార్లు అధికారులను కలిశాం. హెల్త్కార్డులివ్వాలని మొరపెట్టుకున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ పేరిట సర్కార్ మళ్లీ కొత్త డ్రామాకు తెరతీసింది. ప్రభుత్వం సానుభూతి మాటలు చెప్తున్నది. సీఎం చెప్పినట్టుగా ఆచరణలో అమలు కావడం లేదు. ఇక మా ఓపిక, సహనం నశిస్తున్నది. జనవరి 1 నుంచి హెల్త్కార్డులిస్తారని ఆశిం చాం. కానీ ప్రమాద బీమాను తెరపైకి తెచ్చారు. తక్షణమే హెల్త్‌కార్డులను ఇవ్వాలన్నదే మా డిమాండ్.
– సదానందం గౌడ్,ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
గంపెడాశలు పెట్టుకున్నం
ఈహెచ్ఎస్ స్కీం అమలుపై ఉద్యోగులు, పెన్షనర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ పథకం అమలు కోసం మేం వాటా ఇస్తామన్నాం. ప్రతి నెలా కొంత చెల్లిస్తామని చెప్పాం. ఆటోమెటిక్‌గా మా వాటాను కట్ చేసుకోమన్నాం. ప్రభుత్వం కొంత సమకూర్చితే వందల కోట్లు ట్రస్టులో జమ అవుతాయి. ఉద్యోగులకు హెల్త్కార్డులిస్తే ఈ ట్రస్టు నుంచి బిల్లులు చెల్లించవచ్చు. దీంతో ఉద్యోగులకు నగదురహిత చికిత్సలు అందుతాయి. మేం డబ్బులిస్తామన్న తర్వాత కార్డులిచ్చేందుకు తాత్సారమెందుకో మాకు అర్థం కావడంలేదు. సగం భారం మేం భరిస్తామంటున్నాం. మిగతా సగం భరించేందుకు కూడా సర్కార్ సిద్ధంగా లేకపోవడం విచారకరం.
– వోడ్నాల రాజశేఖర్,తపస్ రాష్ట్ర అధ్యక్షుడు