హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్‌లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్‌డౌన్‌కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేటం జారీచేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూన్ 9న చలో హైదరాబాద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. జూన్ 9న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ, లక్ష మందితో మహాధర్నా నిర్వహిస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సును నిర్వహించారు.
ఉద్యమంలో భాగంగా తొలుత ఈ నెల 15న జిల్లాల్లోనూ, రాజధానిలోనూ మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. జూన్ 9న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని, అప్పటికీ సర్కారు దిగిరాకపోతే పనివేళల్లో మాత్రమే పనిచేయడం (వర్క్ టు రూల్), ప్రభుత్వ కార్యాలయాల ముందు మానవహారాలు, సామూహిక భోజనాలు, రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు, పెన్‌డౌన్ వంటి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో విశాల ఉద్యమానికి వెనుకాడబోమని స్పష్టంచేశారు. ఎల్ల్లకాలం అణచివేత, సాచివేత, అగచాట్లు, అవమానాలను భరించిన చరిత్ర తెలంగాణ సమాజానికి లేదనే విషయం పాలకులు గుర్తుంచుకోవాలని సూచించారు. సర్కారు ఉదాసీనతతో 13.31 లక్షల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు.
ఓపికతో ఉన్నామని అలుసుగా తీసుకోవద్దు
ఉద్యోగులు ఓపికతో ఉన్నారని అలుసుగా తీసుకోవద్దని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హెచ్చరించారు. మాట్లాడితే ప్రజాపాలన అంటరు.. ఉద్యోగులు ప్రజల్లో భాగస్వామ్యం కాదా? అని ప్రశ్నించారు. ఒక డీఏ, రెండు డీఏ లు పెండింగ్‌లో ఉంటేనే గతంలో ధర్నాలు, సమ్మెలకు దిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవని, ఒక్క మన రాష్ట్రంలోనే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు క్లియర్చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, ఇప్పటివరకు 10% కూడా క్లియర్ కాలేదని చెప్పారు. నెలకు రూ.650 కోట్ల బిల్లులు క్లియర్చేయాలని, ఇచ్చిన హామీలను ఉల్లంఘించి సర్కారు నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు. జూన్ 9న లక్షలాది మందితో కదం తొక్కుతామని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు (టీజీవో) హెచ్చరించారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టే.. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఎందుకు మంజూరుచేయడం లేదని జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్) ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇదేం విధానమని కో చైర్మన్ సదానందంగౌడ్ (ఎస్టీయూటీఎస్) నిలదీశారు. ఖజానాకు జ్వరం వచ్చింది.. పథ్యం చేయాలని సీఎం అంటున్నరు.. ఒక్క ఉద్యోగులమే పథ్యం చేయాల్నా? సీఎం, మంత్రులు, ఐఏఎస్‌లకు పథ్యం వర్తించదా? అంటూ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏనుగుల సత్యనారాయణ (టీఈజీ) ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులం అడ్డామీది కూలీలమా? ప్రతి దానికీ అడుక్కోవాల్నా? అంటూ మరో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ (టీఎన్జీవో) సర్కారును నిలదీశారు. సమావేశంలో జేఏసీ నాయకులు చావా రవి, వంగ రవీందర్‌రెడ్డి, డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి, మారెడ్డి అంజిరెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కే లక్ష్మయ్య, రాజాగంగారెడ్డి, గంగాపురం స్థితప్రజ్ఞ, కే వెంకటేశ్వర్లు, బీ శ్యామ్, ఎం రాధాకృష్ణ, లచ్చుమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణ
ఉద్యోగ జేఏసీ డిమాండ్స్