శేరిలింగంపల్లి, జూలై 26: గోపన్‌పల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇందులో పాల్గొని తమ ఆవేదన వ్యక్తంచేశారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్నప్పటికీ తమను పట్టించుకునే వారే కరువయ్యారని వాపోయారు. ఉద్యోగుల స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు పాగా వేసి లే అవుట్ చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు కేటాయించిన స్థలాలను తిరిగి సొంతం చేసుకునేవరకు పోరాటం ఆపేదిలేదని తేల్చిచెప్పారు.
జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలన్న ఉద్యోగుల ఆశ మరోమారు అడియాసే అయింది. శనివారం కూడా కలెక్టర్‌ను కలవలేకపోయారు. శుక్రవారం తరహాలోనే శనివారం కూడా చివరి నిమిషంలో కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో కలిసే ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన సమావేశంలో భాగ్యనగర్ ఎన్జీవోస్ స్థలాల విషయం చర్చకు వచ్చింది. టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ పీ దామోదర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో భాగ్యనగర్ ఎన్జీవోల సమస్యను చేర్చడంతో పాటు దానిపై చర్చించారు.