హైదరాబాద్, మార్చి6 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం (సదరన్ స్టేట్స్ కాన్ఫరెన్స్) నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా అన్ని రాష్ర్టాలకు సమాచారం అందించి, సమావేశ ఎజెండాను పంపింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబర్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఆయా రాష్ర్టాల్లో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, పథకాల అమలు పురోగతిపై ఈ భేటీలో చర్చించనున్నారు. సీడబ్ల్యూసీ, సీజీడబ్ల్యూబీ, ఎన్‌డబ్ల్యూడీఏ, సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్డీఎస్ఏ వ్యాప్కోస్, కేంద్ర జలవనరులు తదితర విభాగాల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొని ఆయా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పథకాల పురోగతిని వివరించనున్నారు.