హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకున్నది. ఈక్రమంలో మార్చి నుంచి దశలవారీ ఉద్యమానికి కార్యాచరణను ప్రకటించింది. నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో జేఏసీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు ఎదురవుతున్న అవమానాలు, సర్కారు అవలంబిస్తున్న తీరుపై సమగ్రంగా చర్చించారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. మార్చి 31లోపు జిల్లా ఉద్యోగ జేఏసీ కమిటీ నిర్మాణం పూర్తిచేయాలని తీర్మానించారు.
ఏప్రిల్ 1నుంచి 30 వరకు జిల్లా జేఏసీ సదస్సులను నిర్వహించి.. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. మే 4న రాష్ట్రస్థాయి ఉద్యోగుల సదస్సును నిర్వహించడంతోపాటు..మే 15న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూన్ 9న రాష్ట్రస్థాయిలో మహాధర్నాను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి, కో చైర్మన్లు మారెడ్డి అంజిరెడ్డి, ముజీబ్ హుస్సేనీ, ఏనుగుల సత్యనారాయణ, చావా రవి, సదానందంగౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు రాధాకృష్ణ, ముత్యాల సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓ మంత్రులారా..మీ శాఖల్లోని సమస్యలైనా తెలుసుకోండి : మారం జగదీశ్వర్
రాష్ట్రంలోని ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రయోజనాల కోసం పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రులకు సీఎం చెప్పినా పెడచెవిన పెడుతున్నాని తెలిపారు. ‘ఓ మంత్రులారా.. కనీసం మీ శాఖల్లోని ఉద్యోగుల సమస్యలు తెలుసుకోకపోతే ఎలా?’ అంటూ జగదీశ్వర్ ప్రశ్నించారు. కొందరు ఐఏఎస్ అధికారులు సీఎం చెప్పినా మేం కలిసేందుకు వెళితే సమయమివ్వడం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. జీవో 317 సమస్యలు పరిష్కరించలేదని, వీఆర్వోలకు మళ్లీ పరీక్ష పెడతామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇప్పుడున్న అధికారులకు మళ్లీ పరీక్ష పెడితే రాస్తారా..? అని అధికారులను నిలదీశారు. ఒక డీఏ మాత్రమే ఇచ్చారని, ఆరు నెలకో డీఏ చొప్పున పెరగాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణమే రెండు డీఏలను చెల్లించడంతోపాటు మిగతా డీఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్‌చేశారు.
ఇంతకు మీరెవరని అవమానిస్తున్నారు : శ్రీనివాసరావు
సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతోఆశతో తాము మంత్రుల వద్దకెళితే.. ఇంతకు మీరెవరని ఉద్యోగ సంఘాలను దారుణంగా అవమానిస్తున్నారని ఎంప్లాయిస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మంత్రులను తాము ఇప్పటికే 20-30సార్లు కలిస్తే ఇంతకు మీరు ఎవరు..? ఉద్యోగ సంఘాల నేతలా ? అంటూ తమను అవమానించినట్టు ఆయన గుర్తుచేశారు. జీఏడీ సర్వీసెస్‌లోని అధికారులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అం టూ కాలయాపన చేస్తున్నారని, సచివాలయంలో ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడటం లేదని వాపోయారు. రాష్ట్రంలో ఉద్యోగ సంక్షేమం అధమస్థితికి దిగజారిపోయిందని విమర్శించారు. అధికారగణం ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ఆరోపించారు.