హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘పంచభక్ష్య పరమాన్నం పెట్టబడును. కానీ, ఇవాళ ఒక గంటెడు అన్నం వేస్తాం.. ఆరు నెలల తర్వాత గంటెడు సాంబార్ పోస్తాం’ అన్నట్టుగా డీఏల విడుదల విషయంలో ప్రభుత్వం తీరు ఉన్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘ఇప్పుడైతే డీఏ ప్రకటన చేశారు. కానీ, జీవో రావాలి. ఈ నెల జీతంతోనే ఇస్తరా? వచ్చే నెల జీతంతో ఇస్తరా? ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పెడతారు? అన్నది తేలనే లేదు. కానీ, కొన్ని సంఘాల నాయకులు ఇప్పుడే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
హర్షాలు వ్యక్తంచేస్తున్నారు. ఏం సాధించారో ..ఏం తీసుకొచ్చారో వారికే తెలియాలి’ అంటూ ఉద్యోగులు జేఏసీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పుడు ఒక డీఏ, ఏప్రిల్‌లో మరో డీఏ ఇస్తామంటూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘బిచ్చమేసినట్టు ఒక డీఏ ఇస్తరా? ఉద్యోగులంటే అంత చులకనా? ఒక్క డీఏకు మూడు కమిటీలు.. ఆరుసార్లు చర్చలా? రేపు పీఆర్సీ అమలుకు ఇదే తరహాలో కమిటీలేసి సాగదీస్తరా?’ అని మండిపడుతున్నారు.
ప్రభుత్వం కమిటీలు వేసింది.. చర్చలు జరిపింది ఒక్క డీఏ కోసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి, చర్చల సమయంలో ప్రస్తుతం మూడు డీఏలిచ్చి, మరో రెండు డీఏలను పీఆర్సీలో కలపాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కానీ, సర్కారు ఒకే ఒక్క డీఏతో సరిపెట్టింది. రెండో డీఏను ఆరు నెలల తర్వాత ఇస్తామన్నది. రెండో డీఏ ఇవ్వాల్సిన ఆరు నెలల్లో మరో రెండు కొత్త డీఏలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మళ్లీ మోసమేనా? అంటూ నిలదీస్తున్నారు.
డీఏలు ఇచ్చినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, అసలు ఇచ్చినట్టా? ఇవ్వనట్టా? అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇప్పుడు ఒక డీఏ, ఆరు నెలల్లో రెండో డీఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై ఒకటి వస్తే ఆరో డీఏ పెండింగ్‌లో పడుతుంది. మళ్లీ జనవరి 2025 వస్తే ఏడో డీఏ పెండింగ్‌లో పడుతుంది. ఇప్పుడిచ్చే ఒక డీఏను తీసేస్తే.. 2025 జూలై డీఏను కలుపుకుంటే పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుంది.
ఆరు నెలల తర్వాత రెండో డీఏ ఇచ్చారని అనుకుందాం. అప్పటికే జనవరి దాటుతుంది. జనవరి 2026 డీఏను కలిపితే పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుంది. ఇప్పుడేమో రెండు డీఏలిచ్చినట్టు ప్రకటించి ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. పెండింగ్ డీఏలతో రాష్ట్రంలోని ఒక్కో ఉద్యోగి సగటున నెలకు సుమారు రూ.15 వేల చొప్పున నష్టపోతున్నారు.
కనీసం మూడు డీఏలు ఇవ్వాలని జేఏసీ కోరినా, సర్కారు ఖాతరు చేయలేదు. ఒకే ఒక్క డీఏతో సరిపెట్టింది. డీఏ బకాయి లు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. ‘నన్ను కోసుకుతిన్నా.. రూపాయిలేదన్న పరిస్థితి నుంచి డీఏలైతే ఇప్పించగలిగాం. ఏం లేదన్న స్థాయి నుంచి కొంతవరకు లాక్కురాగలిగాం. అంతకుమించి మేమేం చేయగలం’ అంటూ జేఏసీ నేత తన నిస్సహాయతను వ్యక్తంచేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించిన పోరాట కార్యాచరణకు దాదాపు ముగింపు పలికినట్టేనని తెలుస్తున్నది. ఉద్యోగుల 57 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మార్చి 12న ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం మే 15న అన్ని జిల్లాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాల్సి ఉండగా, ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయగానే జేఏసీ ఈ నిరసనను వాయిదావేసింది.
క్యాబినెట్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల 9న తలపెట్టిన చలో హైదరాబాద్, లక్ష మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా జేఏసీ వాయిదావేసింది. క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత, శుక్రవారం జరగాల్సిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్నీ వాయిదావేశారు. జూన్ తర్వాత పెన్‌డౌన్ చేస్తామని, దశల వారీగా ఆందోళనలకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ చొరవకు జేఏసీ అభినందనలు తెలియజేసింది. దీంతో సమరం లేనట్టేనని స్పష్టమైంది.
కమిటీలు కాలయాపనకేనని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా సీపీఎస్ రద్దు ఊసెత్తకపోవడం బాధాకరం. ఒక్క డీఏ కోసం వినతిపత్రాలు తీసుకోవడం, చర్చలు జరపడం విస్మయం కలిగించే అంశం. ఉద్యోగ సంఘాలన్నీ ఒక్క డీఏ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. తక్షణమే మూడు డీఏలను ప్రకటించి, సీపీఎస్‌ను రద్దుచేసి, మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి.
-హన్మండ్ల భాస్కర్, టీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గ్రాట్యుటీ, జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు కుప్పలుతెప్పలున్నాయి. మా పైసలు మాకిచ్చేందుకు కూడా ఇన్స్టాల్మెంట్లా? ఇది బాధాకరం. చాలా అన్యాయం. పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు ఇస్తామన్నారు. మొదట వేటిని ఇస్తారు? రూ.పది లక్షలలోపా? అంతకుమించి ఇస్తరా? దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈహెచ్ఎస్ను ఎప్పటినుంచి అమలుచేస్తారో చెప్పలేదు. ఈ నెల 10న పెన్షనర్స్ జేఏసీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
– లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్
దేశంలో ఎక్కడా ఇన్ని డీఏలు పెండింగ్‌లో లేవు. మేం కనీసం మూడు డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. ఐదు పెండింగ్ డీఏల్లో కనీసం మూడు ఇస్తే అంతా సంతోషించేవాళ్లం. ఆరు నెలల్లో రెండో డీఏ ఇస్తామన్నారు. ఈ ఆరు నెలల్లో రెండు కొత్త డీఏలు చేరతాయి. ఈహెచ్ఎస్ జీవో గతంలోనే వచ్చింది. ట్రస్టు సభ్యులను నియమించాల్సి ఉన్నది. పీఆర్సీ మాటే ఎత్తడంలేదు. సాచివేత ధోరణి ప్రదర్శిస్తే ఐక్య ఉద్యమాలను ఉద్ధృతం చేస్తం.
– చావ రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రెండొందల సంఘాలను కలుపుకుని జేఏసీగా ఏర్పడి, కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ జేఏసీ ఏం సాధించిందో స్పష్టంచేయాలి. తెచ్చేది.. ఇచ్చేది మేమే అన్న సంఘం నాయకులు ఏం తెచ్చారో.. ఏం ఇచ్చారో ప్రకటించాలి. తొక్కిపెట్టి నారతీస్త్తమని వార్నింగ్‌లు ఇచ్చిన నాయకులు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? జేఏసీ నేతలు ప్రభుత్వం మీద పోరాడే స్థితిలో లేరు. వారు పత్రికా ప్రకటనలకే పరిమితం. ఉపాధ్యాయ సంఘాల ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యం. ప్రభుత్వంపై పోరాటం చేయడమే ఉద్యోగుల కర్తవ్యం.
– సుంకర శ్రీనివాస్, బీసీటీయూ