‘ప్రతి నెల ఒకటో తేదీన జీతాలివ్వడానికే తలప్రాణం తోకకొస్తున్నది. జీతాలు తీసుకుని సేవచేయండి, అదనంగా ఏం కోరికలు కోరకండి. అమ్మిపెడదామన్నా మాదగ్గరేం లేదు.
రెండు గంటలు ఎక్కువ పనిచేస్తే మరో రెండు ఉచితాలు పెంచుతారే తప్ప, మమ్మల్ని రేవులో ముంచబోరన్న గ్యారెంటీలు ఉన్నదా?
ఆరు గ్యారెంటీలు ఇస్తరనుకున్నమేగానీ ఆరు డీఏలు పెండింగ్‌లో పెడ్తరనుకోలేదు.
ప్రజాపాలనంటే ఉద్యోగులను ముంచడమా? ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టున్నది!
మేం కోరికలు కాదు.. హక్కులు అడుగుతున్నం
‘ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తాం. పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లిస్తాం. పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో చెల్లిస్తాం. సీపీఎస్‌ను రద్దుచేస్తాం’ ఇవీ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు.
‘ప్రతి నెల ఒకటో తేదీన జీతాలివ్వడానికే తలప్రాణం తోకకొస్తున్నది. అప్పటికప్పుడు జీతాలిచ్చేందుకు రూ.4 వేల కోట్లు ఆర్బీఐ దగ్గర చేబదులు తీసుకుని సర్దినం. జీతాలు తీసుకుని సేవచేయండి, అదనంగా ఏం కోరికలు కోరకండి. అన్ని లెక్కలు మీ ముందే పెడతా. డీఏల కోసం ధర్నాలు, దీక్షలు, బంద్‌లు, పెన్‌డౌన్ చేస్తమనుకుంటే, ఏది డౌన్ అన్నా.. మొత్తం ప్రభుత్వమే డౌన్ అయ్యిద్ది. అమ్మిపెడదామన్నా మాదగ్గరేం లేదు. మా సొంతానివి అమ్మిపెట్టినా దేనికీ సరిపోవు. జపాన్‌లో నిరసన తెలపాలంటే రెండు గంటలు అదనంగా పనిచేస్తరు. ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి ఆదాయాన్ని పెంచితే మంచిది’- ఇవీ శనివారం శానసమండలిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇటీవల రవీంద్రభారతిలో నిర్వహించిన సమావేశంలోనూ సీఎం ఇదే తరహాలో మాట్లాడారు.
Government Employees | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మాటలు, కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడింత మోసమా? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ప్రసంగంపై ఎక్స్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా వేదికలు, వాట్సాప్ గ్రూపుల్లో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం వ్యవహారం చూస్తుంటే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్’ చేస్తున్నట్టుగా ఉన్నదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
‘అధికారంలోకి రాకముందు అలవిగాని హామీలిచ్చారు. హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి తెలియదా? తెలియక హామీలిచ్చారా? లేక అధికారంలోకి వచ్చాక మోసం చేయవచ్చులే అన్న ధీమాతో ఇలా చేశారా?’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అది ఫ్రీ.. ఇది ఫ్రీ.. అంటూ ఉచితాలు ఎవ రు ఇవ్వమన్నరు. మీ తప్పిదాలకు మమ్మల్ని శిక్షిస్తరా? అధికారం చేజిక్కించుకునేందుకు ఆశలు రేకెత్తించి, ఉద్యోగుల ఓట్లు వేయించుకొని ఇంత మోసం చేస్తరా?’ అని మండిపడుతున్నారు. ‘డీఏలు ఇవ్వలేమని అంటున్నరు. డీఏ అంటే నిజ జీతంలో పెరుగుదల కాదు సార్. పడిపోయిన రూపాయి విలువకు సమానంగా ఇచ్చే పరిహారం. నాలుగు డీఏలు అంటే రెండేండ్లలో పడిపోయిన రూపాయి విలువ పరిహారాన్ని మేం అందుకోలేదు. ఈ పరిహారాన్ని పొందడం మా హక్కు’ అంటూ ఉద్యోగులు సోషల్‌మీడియాలో సర్కారుపై దుమ్మత్తిపోస్తున్నారు. ‘ఉచితాలిస్తరు కానీ, జీతాలివ్వలేరా? పెండింగ్ బిల్లులు చెల్లించలేరా? డీఏలు ఇవ్వలేరా? పీఆర్సీ ప్రకటించలేరా? హెల్త్‌కార్డులు ఇవ్వలేరా? ఇవన్నీ చేతగాకపోతే మా వల్ల కాదని దిగిపోండి’ అంటూ సర్కారుకు సూచిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు హామీలిచ్చి తప్పించుకుంటారా? అని పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి(పెన్సనర్స్ జేఏసీ) సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించింది. ఉద్యోగులు, పెన్షనర్లు డీఏలు, పీఆర్సీలు అడగొద్దన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భగ్గుమన్నది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన పెన్షనర్స్ జేఏసీ కోర్ కమిటీ సమావేశంలో సీఎం వ్యాఖ్యలపై చర్చించారు. ‘జీతాలు ఇచ్చేందుకే తల ప్రాణం తోకకు వస్తుంది’ అన్న సీఎం మాటలను తీవ్రంగా ఖండించింది. అదిగో పీఆర్సీ, ఇదిగో డీఏ అంటూ సాగదీసిన ప్రభుత్వం..
ఇప్పుడు ఇవ్వలేమనడం దారుణమని మండిపడింది. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో అనేక హామిలిచ్చి, ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పించుకోవడాన్ని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ టీ శుభాకర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు ఉచితాలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, ఉద్యోగులూ ప్రజలేనని, కనీసం మూడు డీఏలైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనర్ బెనిఫిట్స్ అందజేయాలని, అన్ని దవాఖానల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అమలుచేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్లు సూర్యనారాయణ, రాజేంద్రబాబు, భరత్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, తులసి సత్యనారాయణ పాల్గొన్నారు.