హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్ఈఐఎస్) ఉన్నతాధికారులు పండుగ మురిపెం లేకుండా చేస్తున్నారని సొసైటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సొసైటీలో లేనివిధంగా శిక్షణ పేరిట దసరా పండుగను దూరం చేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని శిక్షణను వాయిదా వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, లైబ్రేరియన్ తదితర ఖాళీలన్నింటినీ ఇటీవల ట్రిబ్ భర్తీ చేసింది.
రెండు నెలల క్రితమే రిక్రూట్ అయినవారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి సొసైటీలన్నీ ఉద్యోగులకు ఓరియంటేషన్ శిక్షణ పూర్తిచేశాయి. అయితే, ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం ఉద్యోగాల్లో చేరిన 2 నెలల తర్వాత, దసరా సెలవుల్లో శిక్షణ ఏర్పాటుచేసింది. నేటి నుంచి ఈ నెల 8 వరకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సరూర్‌నగర్‌లోని ఉమెన్ లా అండ్ పీజీ కాలేజీలో శిక్షణ కొనసాగనున్నది. ఇదే సమయంలో డిగ్రీ కాలేజీ ఉద్యోగులకు సైతం శిక్షణ డ్యూటీలను అలాట్ చేసింది. పండుగ ముందు, సెలవురోజుల్లో శిక్షణ ఏర్పాటుపై ఉద్యోగులు, కొత్తగా రిక్రూటైన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల్లో చేరిన 2 నెలల తర్వాత శిక్షణ పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.