హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఆర్థికశాఖ పరిధిలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో కొందరికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారని, అసంబద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం ఒక ప్రాంతంలో నాలుగేండ్లు పూర్తయిన ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుంది. మూడేండ్లు పూర్తయిన వారు కోరుకుంటే బదిలీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించకూడదనే నిబంధన విధించారు.
ఖజానా విభాగంలో నా లుగేండ్ల నిబంధనను పట్టించుకోకుండా 40 శాతం మంది ఉద్యోగుల జాబితాను రూపొందించి, అందరినీ బదిలీలకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆదేశించినట్టు చెప్తున్నారు. ఇతర విభాగాల్లో ఇలా ఒత్తిడి చేయలేదని చెప్పినా వినలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. చివరికి టీజీవో, టీఎన్జీవో సంఘ నాయకులు కల్పించుకొని ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీంతో నాలుగేండ్ల సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేసేలా జాబితాను మార్చినట్టు వెల్లడించారు.
స్పౌజ్ కోటా బదిలీల్లోనూ అక్రమాలు జరిగినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ఆ శాఖ ఉద్యోగులు పలు ఉదాహరణలు ఇస్తున్నారు. ‘నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎస్టీవో నాలుగేండ్ల సర్వీస్ పూర్తికాకున్నా స్పౌజ్ ఆప్షన్ కింద బదిలీ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన భార్య నల్లగొండ సమీపంలోని ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయనకు నల్లగొండ జిల్లా ఖజానా కార్యాలయానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయనకు 40 కిలోమీటర్ల దూరంలోని ఎస్టీవోకు బదిలీ చేశారు’ అని పేర్కొన్నారు.
ఇది జీవో 38ను అవమానించడమే అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదని పేర్కొన్నారు. ‘ఖమ్మం జిల్లాలో ఒక ఎస్టీవో స్పౌజ్ కోటాలో తన భార్య పనిచేస్తున్న అదే జిల్లా నేలకొండపల్లికి ఆప్షన్ ఇచ్చారు. కానీ ఆయనను ఏకంగా వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం స్పౌజ్ కోటా ఆప్షన్ ఇచ్చినవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనను అధికారులు పట్టించుకోలేదు’ అని ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా డీటీవోలో పనిచేస్తున్న ఒక ఎస్టీవో తాను టీజీవో ఆఫీస్ బేరర్నని, విడో అని.. తనను అక్కడే ఉంచాలని వినతి పెట్టుకొన్నా.. అధికారులు తిరస్కరించి బదిలీ చేశారని ఉద్యోగులు పేర్కొన్నారు. కానీ నకిలీ అసోసియేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా కొందరిని అడిగిన చోట పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇలా తమకు నచ్చినవారికి, నచ్చినచోట పోస్టింగ్లు ఇచ్చేందుకు అధికారులు ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసినట్టు చెప్తున్నారు. పైగా బదిలీ ఉత్తర్వులను 30వ తేదీన రాత్రి 11 గంటలకు ఇచ్చారని చెప్పారు. సీనియర్ అకౌంటెంట్స్ బదిలీల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై వెంటనే కల్పించుకొని ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.