హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సర్కార్‌పై సమరశంఖం పూరించారు. జూన్ 2వ తేదీలోపు తెలంగాణ రెండో పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ నెల నుంచే ఉద్యమానికి పూనుకోనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మూసారాంబాగ్‌లోని రెవెన్యూ భవన్లో నిర్వహించారు. 206 సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని సర్కార్ తీరును నిరసించారు. పీఆర్సీని ప్రకటించకపోవడంతో ఉద్యోగులు 30 నెలలుగా నష్టపోతున్నారని వాపోయారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని, రెండున్నరేండ్లుగా పీఆర్సీని కోల్పోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
పీఆర్సీ కమిటీ గడువు ముగిసినా పొడగిస్తూ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. పీఆర్సీ ప్రకటించకపోతే జూన్ తర్వాత సర్కారుర్కు ఉద్యోగుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ముందుగా 17న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని సూచించారు. ఆ తర్వాత మే 5న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహారదీక్షలకు దిగుతామని జేఏసీ తెలిపింది. ఈ రెండు దశల పోరాటం తర్వాత సర్కార్ దిగిరాకుంటే మే 14న జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు ప్రకటించారు.
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు తమ ప్రవర్తన మార్చుకోవాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. సీనియర్ ఐఏఎస్‌లు బాగానే పనిచేస్తున్నారని.. కానీ కొందరు ఐఏఎస్ అధికారుల ప్రవర్తన బాగాలేదని ఆరోపించారు. వారు చిరుద్యోగులపై దండయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ప్రత్యేకించి జనగామ కలెక్టర్ వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేకపోతే ఆయా ఐఏఎస్‌లు లక్ష్యంగా జేఏసీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సర్వీస్ తక్కువుండి.. అవగాహనారాహిత్యంతో ఐఏఎస్‌లు 30 ఏండ్లు పనిచేసిన ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీసీఎం, మంత్రులు ఆదేశాలిచ్చినా కొందరు అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సదరు ఐఏఎస్‌లపై ప్రభుత్వం విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల జేఏసీ సమావేశంలో కొందరు నేతలు.. ఉత్తుత్తి మీటింగ్‌లతో ఒరిగేదేంలేదు.. ఉద్యమించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. కొందరు ఉపాధ్యాయ సంఘాలు, టీఎన్జీవో సంఘం నేతలు యుద్ధం చేయాల్సిందే.. ఉద్యమించాల్సిందేనని స్పష్టంచేసినట్టు సమాచారం. అయితే కొందరు ప్రభుత్వ అనుకూల సంఘాల నేతలు ఉద్యమం వద్దు, సంయమనం పాటిద్దామంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
ఇంకా ఎంత కాలమని సంయమనం పాటిద్దాం.. ఇంకా ఉపేక్షిస్తే ఉద్యోగులు నాయకత్వాన్ని విశ్వసించే పరిస్థితుల్లేవని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు డ్రా చేసుకొనేందుకు ప్రభుత్వ పర్మిషనెందుకు.. సంవత్సరాల తరబడి ఇవ్వకపోతే ఇంకా చూస్తూ కూర్చోవాలా? అంటూ గట్టిగా నిలదీసినట్టు తెలిసింది. దీనికి పెన్షనర్ల సంఘాల నేతలు సైతం స్వరం కలిపారు. మొత్తంగా అన్నివైపుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జేఏసీ నాయకత్వం కార్యాచరణను ప్రకటించాల్సి వచ్చినట్టు తెలిసింది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకై ఉద్యమించాలని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ సమావేశంలో డిమాండ్ చేసింది. లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగాలని సంఘం కోరింది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ అందడంలేదని, మూడు డీఏ ఏరియర్స్ రూ.800కోట్లు ఉద్యోగుల ఖాతాల్లో జమకావడంలేదని సంఘం నేతలు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్, నాగులవంచ నరేందర్రావులు ఆవేదన వ్యక్తంచేశారు.
సీపీఎస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతంచేస్తామని వారు హెచ్చరించారు. జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి, వంగా రవీందర్‌రెడ్డి, ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), బీ శ్యామ్, కస్తూరి వెంకటేశ్వర్లు, జీ సదానందంగౌడ్, డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి, ముత్యాల సత్యనారాయణగౌడ్, కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, చింతకుంట జగదీశ్, ఎం రాధాకృష్ణ, డాక్టర్ కే రామారావు, నోరి శ్రీనేశ్‌కుమార్, ఎంబీ కృష్ణాయాదవ్, కట్కూరి శ్రీకాంత్, మణిపాల్‌రెడ్డి, ఉమాదేవి, పీ వెంకట్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. లేదంటే ఆయనకు క్షేత్రస్థాయిలో తగినశాస్తి తప్పదని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇదే విషయంపై జేఏసీ సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. ఆకునూరి మురళి ఇటీవల టీచర్లకు జీతాలెక్కువున్నాయని వ్యాఖ్యానించారు. హెచ్ఎంల ఉద్యోగోన్నతులు రద్దుచేయాలని, టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని సిఫార్సు చేశారు. దీనిపై టీచర్లలో ఆగ్రహావేశాలింకా తగ్గడంలేదు.