Congress | హైదరాబాద్, ఫిబ్రవరి1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో రగిలిన కుంపటిపై రాష్ట్ర క్యాబినెట్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని ‘కాంగ్రెస్‌లో కుంపటి’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ శనివారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహించారు. జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్న మంత్రులు, తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ ఎజెండాగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు సీఎం కార్యాలయం ప్రకటించినప్పటికీ, ఎమ్మెల్యేల తిరుగుబాటుకు దారితీసిన కారణాల మీదనే సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? సహజసిద్ధ కోపతాపాలతోనే తిరుగుబాటు చేస్తున్నారా? ఇతరుల ప్రోద్బలంతో చేస్తున్నారా? అని ఆరా తీసినట్టు తెలిసింది.
రహస్య భేటీపై సీఎం ఆందోళన!
జిల్లాల్లో ఇన్‌చార్జ్జి మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని చెప్పినట్టు సమాచారం. ఈ ఎన్నికలు మన పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో కలిసి పనిచేయాల్సిందిపోయి తిరుగుబాటు చేయడం మంచిది కాదని, ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ దేనికి సంకేతమనే ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించి వారిని కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా మంత్రులకు సూచించినట్టు తెలిసింది.
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపే బాధ్యత మంత్రులు తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు అవసరమైన వనరుల కల్పన కూడా మంత్రులే చూసుకోవాలని సీఎం అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లిలో చేసిన వ్యాఖ్యల మీద కూడా చర్చించినట్టు తెలిసింది. ‘కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదు’ అని కేసీఆర్ చేసిన హెచ్చరికల మీద చర్చించినట్టు తెలిసింది. కేసీఆర్ హెచ్చరికల వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రికి సూచించినట్టు సమాచారం. రాష్ట్ర ఇంటెలిజెన్స్వర్గాలను ఎర్రవల్లి ఫాంహౌజ్ మీద నిఘా మరింత పటిష్టపరచాలని ఈ సందర్భంగా ఆదేశించినట్టు తెలిసింది.
ప్రజల్లోకి వెళ్లలేనోళ్ల రాజకీయం: సీఎం
గత రాత్రి జరిగిన విందులో పాల్గొన్నవారి వివరాలు తన వద్ద ఉన్నాయని, ప్రజల్లోకి వెళ్లలేని ఎమ్మెల్యేలు కొంతమంది గుంపుకట్టి రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్వరంతో అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. జనవరిలో గ్రామసభలు నిర్వహించినప్పటి నుంచే పార్టీలో ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తున్నారని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో జిల్లా ఇన్చార్జి మంత్రులకు విచక్షణాధికారాలు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారని కొందరు మంత్రులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. మంత్రులతో సమానంగా నియోజకవర్గాలకు నిధులు అడుగుతున్నారని మరికొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. అధికారంలోకి వచ్చి ఏడాదైనా, ఇప్పటివరకు నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధి (సీఎస్డీఎఫ్) ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది.