ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి హతమార్చింది. పెంచికల్‌పేట మండలం కొండపల్లికి తారు పోషన్న (50) అనే రైతు మిర్చితోటలో పనిచేసుకుంటుండగా దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఏనుగును అక్కడినుంచి తరిమేశారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో రైతు అల్లూరి శంకర్ (55), తన భార్య సుగుణతో తమ తోటలో మిరపకాయలు ఏరుతున్నారు. అదే సమయంలో బూరెపల్లి-రణవెల్లి గ్రామాల మధ్య చేలల్లో ఏనుగు తిరగడాన్ని స్థానిక రైతులు గమనించారు. జనవాసాల్లోకి వచ్చి ఎక్కడ దాడి చేస్తుందోనని భావించి కేకలు వేయగా, అది చేలల్లో గుండా పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్‌పై దాడి చేసింది. తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అయితే ఏనుగు వరుసగా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గజరాజును త్వరగా బంధించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.