Free Electricity | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం. అట్టహాసంగా ప్రకటించిన బడులకు ఉచిత విద్యుత్తు పథకం ఆఖరుకు ఉత్తదే అయ్యింది. పథకం ప్రకటించి నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు జీరో బిల్లులు జారీకావడంలేదు. రాష్ట్రంలోని 32వేల విద్యాసంస్థలకు ఇప్పటికీ వినియోగమైన విద్యుత్తుకు బిల్లులు జారీ అవుతున్నాయి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లలోపు వినియోగమున్న గృహాలకు జీరో బిల్లులు జారీచేస్తున్నారు. కానీ విద్యాసంస్థలకు మాత్రం జీరో బిల్లులివ్వడం మరిచారు. దీంతో పాఠశాలల హెడ్మాస్టర్లకు టెన్షన్ పట్టుకున్నది. ఇదేం స్కీమ్ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అమలు జాడేది..?
రాష్ట్రంలోని సర్కారు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తునిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఏడాది సెప్టెంబర్ 5న ప్రకటించారు. అదేరోజు ప్రభుత్వం జీవో -20ని జారీ చేస్తూ.. సర్కారు విద్యాసంస్థలకు చెందిన విద్యుత్తు బిల్లులను ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఈ ఉచిత విద్యుత్తు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో జీవో -20ని ప్రదర్శించారు. ఇదే మా చిత్తశుద్ధి అంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ, నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు ఈ స్కీం అమలుకు నోచుకోలేదు. విద్యాసంస్థలకు జీరో బిల్లులు జారీకాలేదు. దీంతో ఇంతకు ఈ స్కీమ్ ఉన్నట్టా.. లేనట్టా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
వందకోట్లకు పైగా బకాయిలు..
రాష్ట్రంలోని సర్కారు బడులకు సంబంధించిన విద్యుత్తు బిల్లులు రూ.100 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ఈ బకాయిలను సైతం మాఫీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. మూడు నెలలు గడిచినా ఇంతవరకు వీటిపై ప్రభుత్వం తేల్చలేదు. అటు బకాయిలు మాఫీ కాకపోగా, ఇటు జీరో బిల్లులు జారీకాకపోవడం గమనార్హం. అయితే రాష్ట్రంలో 31వేల విద్యాసంస్థలున్నాయి. కానీ ప్రకటన సమయంలో కేవలం 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తునిస్తామని తెలిపారు. అంటే ఉచిత విద్యుత్తును కొన్నింటికిచ్చి, మరికొన్నింటికి ఇవ్వరా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణలివిగో..