Gruha Jyothi | జగిత్యాల, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): ‘ఆరిపోయిన గృహజ్యోతి పథకం’ శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మౌనికకు గృహజ్యోతి పథకం వర్తించకపోగా, ఒకేసారి 6 నెలల బిల్లలు చెల్లించాలన్న ఆమె ఆవేదనకు నమస్తే అక్షరరూపం ఇచ్చింది. ఈ కథనాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా రాష్ట్రంలోని ఎందరో సోషల్ మీడియా వేదికల్లో పోస్టులుగా పెట్టారు.
దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు స్పందించారు. మౌనిక సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. ఎన్పీడీసీఎల్ అధికారులు మౌనిక ఇంటికి వెళ్లి విద్యుత్తు మీటర్‌తోపాటు బిల్లులు, ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్ పరిశీలించారు. దరఖాస్తు ఫారమ్‌లో గృహజ్యోతి పథకం వర్తింపు కాలమ్‌లో రైట్మార్క్ వేయకుండా, ఇంటు మార్క్ వేసిందని, దీంతో ఆమె పేరును గృహజ్యోతి పథకంలోకి పరిగణనలోకి తీసుకోలేదని అధికారులు సెలవిచ్చారు. ఆమె కిరాయి ఇంటిలో ఉన్నట్టు పేర్కొనలేదనీ తేల్చారు. దాంతోనే ఆమెకు జీరో బిల్లు జనరేట్ కాలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆన్లైన్లో సరిచేశామని, ఇక నుంచి మౌనికకు జీరో బిల్లు వస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 6 నెలల విద్యుత్తు బిల్లు బకాయిలు చెల్లించాలని కోరడంతో మౌనిక భర్త రవికుమార్.. ఫోన్‌పే ద్వారా మొత్తం బకాయిలను చెల్లించారు. మౌనిక ఆవేదనకు ఫుల్స్టాప్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా మౌనిక లాంటి పేదలు ఎందరికో గృహజ్యోతి అమలుగాక లబోదిబోమంటున్నారు. ఈ కథనాన్ని ప్రభుత్వం మౌనిక వ్యక్తిగత సమస్యగా పరిగణించడం విమర్శలకు దారి తీస్తున్నది.
ప్రజాపాలన దరఖాస్తును ట్యాంపరింగ్ చేశారంటూ మౌనిక, ఆమె భర్త రవికుమార్ చెప్పారు. తాము దరఖాస్తు ఫారమ్‌లో గృహజ్యోతి కాలమ్‌లో రైట్మార్క్ వేశామని స్పష్టం చేశారు. దానినే ఇంటు మార్కులా మార్చారని తెలిపారు. రైట్మార్క్పైనే మరో గీతను గీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు.