Electricity Demand | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే పదేండ్లలో విద్యుత్తు అవసరాలు రెట్టింపుకానున్నాయి. ప్రస్తుతమున్న విద్యుత్తు డిమాండ్ 2035 కల్లా డబుల్ కానుంది. 2035 నాటికి రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 1.5 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుకోగలదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. ఇక పీక్ డిమాండ్ రోజుకు 31వేల మెగావాట్ల వరకు చేరగలదని సీఈఏ హెచ్చరించింది. ఇటీవలే రిపోర్ట్ ఆన్ రిసోర్స్ అడిక్వెసీ ప్లాన్ ఫర్ తెలంగాణ-2034-35 నివేదికను సీఈఏ విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఏటా ఆరు శాతానికి పైగా పెరుగనుందని వెల్లడించింది. 2023 -24లో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 84,623 మిలియన్ యూనిట్లుగా ఉండగా, పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లుగా నమోదైంది. ఇది 2034- 35 నాటికి రెట్టింపుకానుంది. రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు రానురాను పెరుగుతాయని, ఆ మేరకు సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. డిమాండ్‌కు తగిన రీతిలో విద్యుత్తు ఉత్పత్తిని రెట్టింపు చేయాలని తెలిపింది.
రాష్ట్రంలో 52 శాతం విద్యుత్తు థర్మల్ ప్లాంట్లలోనే ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 18,958 మెగావాట్లు కాగా, 9,791 మోగావాట్లు థర్మల్ప్లాంట్లల్లోనే ఉత్పత్తి అవుతున్నది. ఆ తర్వాత సౌర విద్యుత్తు రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు వాటా 2,518 (26 శాతం) మెగావాట్లుగా ఉంది. జలవిద్యుత్తు 2,518 మెగావాట్లు (13 శాతం)గా ఉంది. థర్మల్ ప్లాంట్ల లోడ్ ఫ్యాక్టర్ 2028 -29లో 51-59శాతం ఉంటుందని సీఈఏ అంచనా వేసింది. ఇది క్రమేపీ 50 శాతానికి చేరుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి – మార్చి మాసాల్లో పీక్ డిమాండ్ ఉంటుందని, రాత్రితో పోల్చితే పగటిపూటే డిమాండ్ అధికంగా ఉంటున్నదని సీఈఏ తెలిపింది. భవిష్యత్తు డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని సీఈఏ సూచించింది. ముఖ్యంగా సౌర, పవన (విండ్) విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సూచించింది.