హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్‌తోపాటు ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 7:55 గంటల సమయంలో 16,508 మెగావాట్ల రికార్డు వినియోగంగా నమోదైంది. ఈ నెల 10న 15,998 మెగావాట్లు నమోదవగా, బుధవారం 16 వేల మెగావాట్ల మైలురాయిని దాటింది. నిరుడు మార్చి 8న గరిష్ఠ డిమాండ్ 15,623 మెగావాట్లు ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 16 వేల మెగావాట్లకు చేరడం గమనార్హం.
ఇందులో దక్షిణ డిస్కం పరిధిలో 10 వేల మెగావాట్లు నమోదైంది. రాష్ట్రంలో సగటు వినియోగం నిరుడు 267.23 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది 290 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. దక్షిణ డిస్కం పరిధిలో నిరుడు సగటు వినియోగం 175.31 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది 194.63 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. రాష్ట్రంలో సగటు వినియోగం 8.84 శాతం పెరగగా, విద్యుత్తు డిమాండ్ 9.63 శాతం పెరిగింది. విద్యుత్తు డిమాండ్‌ను డిస్కంలు దీటుగా ఎదుర్కొంటున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిమాండ్ మేరకు విద్యుత్తు సరఫరాకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.