హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం నిరుటితో పోలిస్తే రోజుకు 20-30 మిలియన్ యూనిట్లు అధికమైంది. ఈ నెల 21న పీక్ డిమాండ్ 13,816 మెగావాట్లుగా, 20న 12,590 మెగావాట్లుగా నమోదైంది. నిరుడు జూలై 31న 13,541 మోగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఏడాది జూలై 16న 15,443 మోగావాట్లు నమోదైంది. డిమాండ్ పెరగడంతో ఈ నెల 18న సీజీఎస్ అండ్ పర్చేజెస్ కింద 116 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశారు. ఈ వారంలో గరిష్ఠంగా 95 మిలియన్ యూనిట్లు, కనిష్టంగా 70 మిలియన్ యూనిట్లను సీజీఎస్ అండ్ పర్చేజెస్ ద్వారా కొనుగోలుచేసి రాష్ట్ర అవసరాలు తీర్చారు.
విద్యుత్తు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇంధనశాఖ ముఖ్యశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ సోమవారం సచివాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిరుటి కంటే ఈసారి పీక్ డిమాండ్ 14.05% పెరిగినట్టు నవీన్ మిట్టల్ వివరించారు. వర్షాకాలంలోనూ డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో మరింత అధికమయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. నీటి లభ్యత పెరగడం, వరినాట్లు జోరందుకోవడంతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతుందని విశ్లేషించారు. సీఎండీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడేసమయంలో కార్యాలయాల్లో అందుబాటులో ఉండి విద్యుత్తు సరఫరాను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.