Electricity Demand | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరింది. జనవరి 31న సమ్మర్ తరహాలో రికార్డుస్థాయి విద్యుత్తు డిమాండ్ 15,205 మెగావాట్లుగా నమోదైంది. నిరుడు జనవరిలో 13వేల మెగావాట్లుంటే, ఈ ఏడాది జనవరిలో 15 వేల మెగావాట్లకు చేరింది. వేసవిలో రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ 17వేల మెగావాట్లకు చేరుతుందని, హైదరాబాద్‌లోనే 5 వేల మెగావాట్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 287 మిలియన్ యూనిట్లుగా కాగా 120 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతున్నది. 40-45 మిలియన్ యూనిట్లు సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూరుతున్నది.
మిగిలిన విద్యుత్తును ఇతర రాష్ర్టాల నుంచి, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తున్నది. గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం మింట్ కంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ సమీక్షలో పాల్గొన్నారు. డిమాండ్‌కు తగినట్టు విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. మరోవైపు సింగరేణిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎండీ ఎన్ బలరాం థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించారు.