Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవా..? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈనెల 7న అత్యధిక రికార్డుస్థాయిలో 15,920 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. దక్షిణ తెలంగాణ డిస్కంలోనే అత్యధిక డిమాండ్ నమోదు కావడం విశేషం. ఈ ఒక్క డిస్కం పరిధిలో 10,136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో డిమాండ్ 5 వేల మెగావాట్లుగా ఉంది. నిరుడు ఫిబ్రవరి 7న గరిష్ఠ డిమాండ్ 14,270 మెగావాట్లు మాత్రమే ఉండగా, ఈ ఏడాది మాత్రం డిమాండ్ 15000 మెగావాట్లు అధికంగా ఉండటం గమనార్హం. అయితే విద్యుత్ డిమాండ్ సోమవారానికి 15,804 మెగావాట్లకు పడిపోయింది. దీంతో అధికారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
రాష్ర్టానికి అవసరమైన సగం విద్యుత్‌ను బయటి రాష్ర్టాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారుల లెక్కల ప్రకారం 8వేల మెగావాట్లు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నది. సోలార్‌తో కొంత, యాదాద్రి పవర్‌ప్లాంట్ నుంచి మరో 1600 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నది. మిగిలిన 8వేల మెగావాట్లను ఢిల్లీ, పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ ఎంత పెరిగినా అందుకు తగ్గట్టు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కాగా, డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపారు.