హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీని ప్రభుత్వం సమర్థించటాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈయూ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యద్శ ఈదురు వెంకన్న మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల వల్లనే పర్యావరణం దెబ్బతింటుందని చెబుతూ.. ఆర్టీసీని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సుల కారణంగా కాలుష్యం కేవలం 0.09% మాత్రమేనని, మిగిలిన కాలుష్యమంతా ఇతర వాహనాలతోనే వస్తుందని పేర్కొన్నారు. కాలుష్యం పేరుతో బస్సుల తయారీని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి, ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కుట్రను కార్మికులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందున.. ఆ బస్సులను నేరుగా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు.
అక్టోబర్ నెల శ్రీవారి దర్శన కోటా తేదీల విడుదల
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ నెలకుగాను తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటాకు సంబంధించి తేదీల వివరాలను టీటీడీ మంగళవారం వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ-సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం 21న ఉదయం 10గంటలకు వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నది. టీటీడీ వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని భక్తులను టీటీడీ సూచించింది.