హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్, కులగణన పేరిట కాంగ్రెస్ పార్టీ బలహీనవర్గాలను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ పథకాల పేరిట నాటకమాడుతున్నదని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సివిల్ కాంట్రాక్టుల్లో బీసీలకు ప్రత్యేక కోటా, బీసీ సబ్‌ప్లాన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలుచేస్తామని, బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నదని విమర్శించారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నదని దుయ్యబట్టారు. మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు.
మంత్రి పదవుల్లో మొండిచెయ్యి
మంత్రివర్గ కూర్పులో బీసీలకు కాంగ్రెస్ సర్కారు మొండిచెయ్యి చూపిందని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. 60% ఉన్న జనాభాకు కేవలం మూడు మంత్రి పదవులు ఇచ్చి తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. బీసీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యంలేని శాఖలు ఇచ్చారని ఆక్షేపించారు. తప్పులతడకగా నిర్వహించిన కులగణనను దేశానికే రోల్‌మాడల్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తగ్గించి చూపి మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో కులవృత్తులను నమ్ముకున్నవారికి బతుకుదెరువు కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. బలహీనవర్గాలు, బీసీ సంఘాలు సంఘటితమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
నోటీసులకు భయపడేదిలేదు
ప్రజా సమస్యలపై పదేపదే నిలదీస్తున్న కేటీఆర్‌పై కాంగ్రెస్ అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నదని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఇందులోభాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. ఫార్ములా- ఈ రేసింగ్‌తో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, రూ.వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. రేవంత్ సర్కారు మాత్రం ఫార్ములా-ఈ తెచ్చేందుకు కృషిచేసిన కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ నోటీసులకు బీఆర్ఎస్ భయపడబోదని, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని స్పష్టంచేశారు.
క్యాబినెట్ భేటీ నిర్వహించాలి: జైపాల్‌యాదవ్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌పై చర్చించేందుకు ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా చేస్తున్నదని మండిపడ్డారు. బీసీ సంఘాలు సంఘటితమై రేవంత్ సర్కారు కుట్రలను తిప్పికొట్టాలని, స్థానిక ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, ఉపేంద్ర పాల్గొన్నారు.