రవీంద్రభారతి, ఫిబ్రవరి9 : బీసీ రిజర్వేషన్లను పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచితేనే పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా బీసీలకు అవకాశం దక్కుతుందని తెలిపారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు సిఫారసు మేరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుతో సహా అసెంబ్లీలో చట్టం చేస్తే రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఏ విధమైన న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని తేల్చిచెప్పారు.
దేశంలో జరిగే జనగణనలో బీసీ కులగణన చేర్చాలని, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపుడకోవడానికే బీసీ రిజర్వేషన్ల సంఖ్యను ప్రభుత్వం తగ్గించిందని ధ్వజమెత్తారు. 10 శాతం కంటే తక్కువగా ఉన్న ఓసీలను 15.79 శాతంగా ఎలా చూపారని ప్రశ్నించారు. బీసీల సంఖ్యను తక్కువగా చూపించి వారి రాజకీయ రిజర్వేషన్లను దెబ్బదీసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందని విమర్శించారు. తక్షణమే పూర్తి పారదర్శకతతో నిజమైన గణాంకాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఎంబీసీ మాజీ చైర్మన్ తాండూరు శ్రీనివాస్, బీసీ నేత సంగెం సూర్యరావు, గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, అంజి, వేముల రామకృష్ణ తదితరులు
హాజరయ్యారు.