హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను సెప్టెంబర్లో 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారంతోపాటు, స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు.
కామారెడ్డి డిక్లరేషన్ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని కోరారు. ‘50% సీలింగ్’ పేరుతో కొందరు కోర్టు స్టే ఇస్తుందేమో అని వాదిస్తున్నారని, ఇదిపూర్తిగా తప్పుదారి పట్టించే గోబెల్స్ ప్రచారమని కొట్టిపారేశారు. ఇప్పటికే ఈడబ్లూఎస్ రిజర్వేషన్ ద్వారా 60% వరకు రిజర్వేషన్లు గరిష్ఠంగా ఉంటాయనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వెల్లడించిందని తెలిపారు.