జనగామ, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ)/కొడకండ్ల : 45 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్‌గా గెలుపొందినట్టు తొలుత ప్రకటించిన ఎన్నికల అధికారులు 5 నిమిషాల్లోనే ఫలితాన్ని తారుమారు చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థితో రీకౌంటింగ్‌కు అప్పీల్ చేయించి రెండోసారి లెక్కించి 5 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన వ్యవహారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండతండాలో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో మొత్తం 714 ఓట్లు పోలవ్వగా.. అందులో బీఆర్ఎస్ మద్దతుదారుకు 378, సమీప కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 333 ఓట్లు రావడంతో 45 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కౌంటింగ్ హాల్ నుంచి అందరినీ బయటకు పంపించిన తర్వాత 5 నిమిషాలు కరెంట్ కట్ అయ్యింది. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థిని రీ కౌంటింగ్‌కు అప్పీల్ చేయాలని ఎన్నికల అధికారులు సలహా ఇచ్చారు. దీనికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వ్యతిరేకించినా అధికారులు రీకౌంటింగ్ జరిపి బీఆర్ఎస్ అభ్యర్థికి 353, కాంగ్రెస్ అభ్యర్థికి 358 ఓట్లు వచ్చాయని..5 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్టు రెండోసారి ప్రకటించడం వివాదానికి కారణమైంది. 45 ఓట్ల మెజారిటీ వచ్చిన అభ్యర్థి 5 ఓట్లతో ఓడిపోవడం.. కరెంట్ కట్ తర్వాత రీకౌంటింగ్‌కు అధికారులు కోరడంతో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు కొడకండ్ల ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
గెలిచిన నన్ను కావాలనే ఓడించారు. మొదట నన్ను విజేతగా ప్రకటించిన అరగంటకు ఆర్వో కావాలనే ప్రత్యర్థిని పిలిపించిండు. ఈ గ్యాప్‌లో 5 నిమిషాలు కరెంటు తీయించి రీకౌంటింగ్ అని చెప్పించి, నేను ఓడిపోయినట్టు ప్రకటన చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రనే. నేను గెలిచినప్పటికీ ఓడగొట్టేలా చేసిన్రు.
– వాంకుడోత్ సురేశ్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి