హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ నేత నవీన్‌యాదవ్ ఇటీవల పంపిణీ చేసింది అసలు ఓటరు కార్డులేనని తేలింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యథేచ్ఛగా సుమారు 200 నుంచి 300 మంది వరకు ఓటరు కార్డుల పంపిణీ అంశం సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని స్వయంగా నవీన్యాదవ్తోపాటు ఆయన అనుచరుల తమ సోషల్ మీడియా గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొత్తగా వచ్చిన ఓటరు కార్డులను పంపిణీ చేసినట్టుగా వారంతా పోస్టుల్లో ప్రచారం చేసుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవధిలోనే నవీన్‌యాదవ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నవీన్‌యాదవ్ చేతికి ఓటరు ఐడీ కార్డులెలా వచ్చాయి.
ఎన్నికల కమిషన్ నుంచి నేరుగా ఓటరు ఇంటికే అందాల్సిన ఆ కార్డులు ఎలా దారిమళ్లాయి. ఎవరు ఆయన చేతికి అందించారు. నేరుగా ఆయన ఓటరు ఐడీ కార్డులను ఎలా పంపిణీ చేశారు. అన్న విషయాలను పోలీస్ యంత్రాంగం ఆరా తీస్తున్నది. ఈ అంశంపై కొన్నిరోజులు ప్రేక్షకపాత్ర వహించిన అధికారులు 2 రోజుల క్రితమే ఎందుకు ఫిర్యాదు చేశారు? ఫిర్యాదు చేసిన సదరు ఎన్నికల అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నవీన్‌యాదవ్ ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. నవీన్‌యాదవ్ ఇటీవల యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాలయం జీహెచ్ఎంసీ సర్కిల్-19 కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చిన సుమారు 200 నుంచి 300 మందికి నవీన్‌యాదవ్ ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫొటోలు తీసి నవీన్‌తోపాటు ఆయన అనుచరులు తమ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేసి ప్రచారం చేసుకున్నారు.
వాస్తవానికి అధికార యంత్రాంగం ద్వారా చేపట్టాల్సిన ఓటరు ఐడీకార్డుల పంపిణీ ప్రక్రియ రాజకీయ నేత చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అయినా రోజులు గడిచినా అధికారులెవరూ అధికార పార్టీ నేత తీరుపై దృష్టి సారించకుండా ప్రేక్షకపాత్ర వహించారు. ఈ క్రమంలో 5వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో నవీన్‌యాదవ్ నిర్వాకంపై ప్రత్యేక కథనం వచ్చింది. నవీన్‌యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేసినందున చర్యలు తీసుకోవాలంటూ ఆరో తేదీన బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నవీన్‌యాదవ్ ఓటరు ఐడీ కార్డులు పంపిణీ చేసిన విషయంపై సోమవారం రాత్రి జీహెచ్ఎంసీ సర్కిల్-19 డిప్యూటీ కమిషనర్, ఈఆర్వో రజనీకాంత్‌రెడ్డి మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్లు 123(1), 123(2), బీఎన్ఎస్ సెక్షన్లు 170, 171, 174 కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణను చేపట్టారు.
నవీన్‌యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ తుదకు వ్యవహారం ఎటువైపు పోతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. తాజా కాంగ్రెస్ రాజకీయ పరిణామాలను చూస్తే నవీన్‌యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నట్టుగా పార్టీవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎంత లోతుగా, ఎంత త్వరితగతిన విచారణ పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నవీన్‌యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయినా, ఎన్నికల అధికారులు దీనిని ఎందుకు గుర్తించలేకపోయారు? ఒకవేళ గుర్తించినా అధికార పార్టీ నేత అయినందున మిన్నకుండిపోయారా? అనేది కూడా తేలాలి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని పార్టీలు, ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవంగా కొత్త ఓటు నమోదు కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి అన్ని వివరాలు వాస్తవమని తేలితే ఓటరుగా నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల అధికారులు ఓటరు కార్డును రిజిస్టర్ పోస్టు, కొరియర్ లేదా స్వయంగా ఓటరుకు అందించాలనేది నిబంధనలు చెప్తున్నాయి. ఒకవేళ ఓటరు ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా సదరు ఓటరు రిజిస్టర్డు మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అంటే మూడో వ్యక్తి చేతికి ఓటరు ఐడీ కార్డు చేరడమనేది ఎన్నికల నియమావళి ప్రకారం నేరం. ఈ దశలో నవీన్‌యాదవ్ వందలాది మందికి ఓటరు ఐడీ కార్డులను ఎలా పంపిణీ చేశారు? వాస్తవంగా అధికారులైనా పంపిణీ చేయాలి. కానీ నవీన్‌యాదవ్ చేతికి ఎలా వెళ్లాయి? అనేది విచారణలో తేలాల్సి ఉన్నది.