హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా వివిధ నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ, డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని కోరింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓటర్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ‘సర్’ ప్రక్రియ తన లక్ష్యాన్ని చేరుకోలేదని స్పష్టంచేసింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఒక దేశం-ఒక పౌరుడు- ఒకే ఓటు’ అనే ఆలోచనపై బుధవారం బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసిన ఆ పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నేత కురువ విజయ్ వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల తీర్పును వక్రీకరించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యను పరిషరించడానికే ఎన్నికల సంఘం ‘సర్’ ప్రక్రియను చేపట్టినప్పటికీ, ఒక రాష్ట్రంలో ఓటు హకును కొనసాగిస్తూ, మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా నమోదైన వారిని గుర్తించి తొలగించే స్పష్టమైన విధానం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ వంటి పారిశ్రామిక, పట్టణ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఇకడ ఓటు హకు పొందడం చట్టబద్ధమే అయినప్పటికీ, వారి సొంత రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు తొలగించారా? లేదా అన్న దానిపై పారదర్శకమైన యంత్రాంగం ద్వారా తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 17, 18 ప్రకారం.. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎకువ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ‘సర్’ ఒక అద్భుతమైన అవకాశమని, దీనిని ఉపయోగించుకొని రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి ఓటర్లను ఏరివేయాలని డిమాండ్ చేశారు.