భారతీయ తత్వశాస్త్రం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం అత్యంత ప్రయోజనకరమైనది.తెల్లవారుజాముకు ముందు ఉండే ఈ 96 నిమిషాల సమయం.. మానసిక, శారీరక,ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైనది. వ్యక్తిత్వ వికాసానికీ ఎంతో కీలకమైనది. అలాంటి బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం, పలు సాధనలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం సొంతమవుతుంది.
తెల్లవారుజామున బయటి శబ్దాలు, డిజిటల్ అంతరాయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నిశ్శబ్ద వాతావరణం.. మీలోని సృజనాత్మకతను బయటికి తీయడానికి సహకరిస్తుంది. మీరు మరింత లోతుగా ఆలోచించడానికి, సమర్థంగా ప్రణాళిక వేయడానికి దోహదం చేస్తుంది. ఆలోచనలను మరింత స్పష్టంగా విశ్లేషించుకోవడాన్ని ఈ సమయం సులభతరం చేస్తుంది. ఏవైనా క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడానికి కూడా ఇది ఉత్తమ సమయం.
బ్రహ్మ ముహూర్తంలో మనిషి బుద్ధి చాలా చురుగ్గా ఉంటుంది. క్లిష్టమైన వాటిని చదవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది అనువైన సమయం. ఆ రోజంతా మీరు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఒక ప్లానింగ్ సిద్ధం చేసుకోవడం వల్ల.. సమయం వృథా కాకుండా ఉంటుంది.
ధ్యానానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత అనుకూలమైనది. ప్రశాంతంగా కూర్చుని, కళ్లు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. దీనివల్ల మెదడులోని ఒత్తిడి తగ్గి, రోజంతటికీ అవసరమైన ఏకాగ్రత లభిస్తుంది. మీకు ఇష్టమైన మంత్రాన్ని జపించడం, మౌనంగా ప్రశాంతంగా కూర్చోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
ఈ సమయంలో గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి, ప్రాణాయామం లాంటి యోగాసనాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్య నమస్కారాలు, తేలికపాటి యోగాసనాలు చేస్తే.. శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది.
సూర్యోదయానికి ముందే మేల్కోవడం వల్ల.. శరీరానికి సహజ సూర్యరశ్మి తగులుతుంది. ఇది నిద్రా చక్రాన్ని, హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో, శక్తి స్థాయులను కాపాడుకోవడంలో సాయపడుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడి, అలసట తగ్గుతుంది.
ఇంత పొద్దున్నే నిద్రలేవడానికి నిబద్ధత, ఆత్మనియంత్రణ అవసరం. దీనిని ఒక అలవాటుగా మార్చుకోగలిగితే.. అది మీ పని అలవాట్లు, వ్యాయామ దినచర్యలు, సమయ నిర్వహణ లాంటి విషయాలలో క్రమశిక్షణ పెంపొందించు కోవడానికి సాయపడుతుంది.