కొందరి కోరికలు జీవితం కంటే పెద్దగా ఉంటాయి. ఎప్పటికి తీరేనో అనే ఆశనిరాశల్లోనే జీవితం సాగిపోతుంది. మరికొందరు అలా కాదు. నిరీక్షిస్తూ కలలు కనరు. కన్న కలల్ని సాహసంతో సాఫల్యం చేసుకుంటారు. బీహార్ అబ్బాయి శుభం కుమార్ అలాంటి సాహసమే చేశాడు. తను సంపన్న కుటుంబంలో పుట్టలేదు. చేతిలో పెద్దగా డబ్బు లేదు. తన గుండెల నిండా ధైర్యం ఉంది. ప్రపంచాన్ని చుట్టి రావాలనే పట్టుదల ఉంది. దశాబ్దకాలంలో సాహస యాత్రలో ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు! ప్రపంచ దేశాలన్నీ పర్యటించిన అతిపిన్న ఆసియావాసిగా కీర్తిపొందాడు!
శుభం కుమార్ సామాన్య కుటుంబంలో పుట్టాడు. వాళ్లది బీహార్ రాష్ట్రం ముంగర్ జిల్లాలో మక్వా అనే పల్లెటూరు. వాళ్ల నాన్న పాఠశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. కొడుకు గొప్పగా చదివి, మంచి ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. అయితే శుభం కోరిక వేరే. ఎదుగుతున్న రోజుల్లోనే దూర ప్రాంతాలను చూసిరావాలనే కోరికతో ఉండేవాడు. పదమూడేండ్లు వచ్చాక హిమాలయాల్లోని లద్దాఖ్ టూర్‌కి ప్రణాళిక వేసుకున్నాడు. అందమైన హిమాలయాలు చూశాక ప్రపంచాన్ని చూడాలన్న అతని కోరిక మరింత బలపడింది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాడు. ఇతరుల సహకారంతో ట్రావెలర్స్ ప్రయాణించడం, రోడ్డు మార్గంలోనే దేశాల సరిహద్దులు దాటి పోవడం అతణ్ని ఆకట్టుకున్నాయి. ఎంతోమంది ట్రావెలర్ల అనుభవాలు విన్నాడు. భూగోళంపై ఉన్న ప్రతి దేశాన్నీ చూసి రావాలని నిశ్చయించుకున్నాడు.
నాలుగు జతల దుస్తులు, ఒక బ్యాగు, కొంత డబ్బు, బలమైన కోరిక, పట్టుదలతో పదేండ్ల క్రితం… ప్రపంచయాత్రకు సిద్ధమయ్యాడు శుభం. ఒకరిని లిఫ్ట్ అడిగి ప్రయాణం మొదలుపెట్టాడు. బీహార్‌కు సరిహద్దున ఉండే నేపాల్ మీదుగా బయలుదేరాడు. ట్రక్కులు, బస్సులు ఇలా ఏ అవకాశం దొరికితే దాన్ని వాడుకున్నాడు. గంటల తరబడి నడిచాడు. తను అనుకున్న ప్రపంచాన్ని చుట్టి వచ్చే పనిలో అలుపెరగకుండా సాగిపోయాడు. నేపాల్ నుంచి రష్యా, చైనా, థాయ్‌లాండ్ మీదుగా అనేక మధ్య ఆసియా దేశాలు చుట్టేస్తూ ముందుకుసాగాడు. ఆఫ్రికా, అమెరికా ఖండాలను చుట్టి చివరికి బ్రెజిల్లో అడుగుపెట్టాడు. అది తను కాలుమోపిన 197వ దేశం! అన్ని దేశాలు చుట్టొచ్చిన ఈ ప్రయాణంలో ఎన్ని అనుభవాలో! వాటిలో రష్యా ప్రయాణం మరింత సంతోషంగా సాగిందంటాడు శుభం కుమార్. ‘రోడ్డు పక్కన నిల్చుని నా స్టయిల్లో లిఫ్ట్ అడిగేవాణ్ని. ‘ఎవరో పరదేశీ, చిన్న బ్యాగుతో ఒంటరిగా ఉన్నాడు. నా కథేమిటో తెలుసుకుందామ’ని కొందరు ఆగేవాళ్లు. అపరిచితులే కానీ, నా ఆసక్తిని గుర్తించి ఎక్కడిదాకా వెళ్తే అక్కడి దాకా లిఫ్ట్ ఇచ్చేవాళ్లు. అలా రష్యన్ల ఔదార్యంతో ఖర్చు లేకుండా ముప్పై వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాను’ అని చెప్పుకొచ్చాడు శుభం.
లా‘డెన్’లో తను వెళ్లే దారిలో వచ్చే వాహనం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు శుభం. లిఫ్ట్ దొరికితే గంటలో అనుకున్న మజిలీ చేరుకునేవాడు. లేదంటే.. అక్కడే ఉండిపోయేవాడు. పెట్రోలు బంకులు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్ల దగ్గర రాత్రి పడుకునేవాడు. ఆదరించినవారికి తనేమిటో, తన లక్ష్యమేమిటో చెప్పి, మెప్పించేవాడు. అలా వాళ్ల ఇళ్లల్లో ఉచిత బస పొందేవాడు. ఇలా ఖర్చులేని ప్రయాణమే ఎక్కువగా చేశానంటాడు శుభం. ఈ ప్రయాణంలో అద్భుతమైన కట్టడాలు, ప్రకృతి దృశ్యాలే కాదు ఆశ్చర్యపరిచే సన్నివేశాలూ ఉన్నాయి. కజకిస్తాన్ యాత్రలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఓ నగర మేయర్ కనిపించాడట. తన పరిచయంతో పార్లమెంట్ భవనం చూశాడు. తనతోపాటు కొన్ని పెండ్లి వేడుకల్లో పాల్గొన్నాడు.
మరణించిన వాళ్ల అంతిమ యాత్రల్లో పాల్గొన్నాడు. ఇలా తిరుగుతున్నప్పుడు ఒక రోజు ఓ ఇంట్లో ఆశ్రయం పొందాడు. మాటల సందర్భంలో ఒకప్పుడు ఈ ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ అయిన లాడెన్ డెన్ అదేనని విని నిర్ఘాంతపోయాడు! వింతల ప్రపంచంలో ఇలాంటి అనుభూతులెన్నో శుభం కుమార్ ప్రయాణంలో ఉన్నాయి.
ట్రావెల్ ముచ్చట్లు
ప్రపంచ దేశాల్లో ప్రయాణం కేవలం రోడ్డు మార్గంలో వాహన చోదకుల సాయంతో సాగిపోలేదు. ముఖ్యంగా చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మంచు ఎడారుల్లో ప్రయాణానికి స్థానిక ఆదివాసీ తెగలు సాయపడ్డాయట. మైనస్ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణంలో 44 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో షేర్ చేస్తూ వచ్చాడు. యూట్యూబ్‌లో నొమాడ్ శుభం (సంచారి శుభం) పేరుతో నిర్వహిస్తున్న అతని యూట్యూబ్ చానెల్‌కు మూడున్నర మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. “నా జర్నీ కథ కాదు. ఒక సాధారణ బాలుడు ఈ ప్రపంచాన్ని చుట్టివచ్చాడన్న నిజం ఉంది ఇందులో. నన్ను ఆదరించినవాళ్లకు, అభిమానించేవాళ్లకు, నా ప్రయాణ విశేషాలను చదివి మెచ్చుకున్నవాళ్లకు, నా ప్రయాణాన్ని చూసిన వారికి, చూస్తున్నవారికి అందరికీ నా కృతజ్ఞతలు’ అంటాడు శుభం కుమార్.