Vote | హైదరాబాద్ : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే మీ పేరు నమోదు చేయించుకోండి. దీనికోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కులేని వాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవాళ్లు.. చిరునామా మార్చుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. 2023 అక్టోబరు 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. ఈ మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 21వ తేదీన ప్రకటించనుంది. ఆ జాబితాలో మార్పులు చేర్పుల కోసం సెప్టెంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటర్ల నమోదు, అభ్యంతరాలకు స్వీకరించడానికి ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 28వ తేదీలోపు పరిశీలించి.. అక్టోబరు 4వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఇదే ఓటరు జాబితాతో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు చేర్పులకు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.