Amit Shah | హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం ‘బీజేపీ గోస’ సభగానే నడిచింది. రైతుకు భరోసా ఇస్తామన్న మాట బ్యానర్లకే పరిమితమయ్యింది. సభకు ముందు బీజేపీ చేసిన హడావుడి మొత్తం గాలిమాటలే అని తేలిపోయాయి. కనీసం 20 వేల మంది కూడా పట్టని స్టేడియంలో సభ నిర్వహిస్తే.. అందులో సగం కూడా నిండకపోవడంతో కాషాయ నేతలు ఖంగుతిన్నారు. బీజేపీపై ఖమ్మం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని తెలుసని, కానీ ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేదని స్థానిక నేతలే గుసగులాడుకోవడం గమనార్హం. జనం లేని సభను చూసి అమిత్‌షా ముభావంగా ఉన్నారని, తనకు అలవాటైన నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోయారనే చర్చ నడుస్తున్నది. ఖమ్మం దాకా వచ్చి భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకోకుండా వెనుదిరిగిన అమిత్ షాపై సొంత పార్టీనేతలే గుర్రుగా ఉన్నారు.
10 శాతం జనం కూడా రాలే!
ఖమ్మంలో లక్షమందితో సభ నిర్వహిస్తామని బీజేపీ నేతలు గప్పాలు కొట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మొదలు నేతలంతా కొన్ని రోజులుగా ఖమ్మంలోనే తిష్టవేశారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని జనసమీకరణకు ఏర్పాట్లు చేసుకొన్నారు. ఊర్లకు బస్సులు, కార్లు పంపించారు. కానీ.. ప్రజలు నిర్దాక్షిణ్యంగా కాషాయ పార్టీని తిరస్కరించారు. 20 వేల మంది వస్తారని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకొంటే.. 8వేల నుంచి 10 వేల మందికి మించి రాలేదని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఖమ్మంలో బీజేపీ బలం సున్నా అని, సభ పెట్టి అవమానపడొద్దని సీనియర్లు మొదటి నుంచీ చెప్తున్నారు. గతంలో ఒకసారి గుడ్డిగా ముందుకు వెళ్లి సభ ఏర్పాట్లు చేయగా, విషయం తెలుసుకొని అమిత్ షా తన పర్యటన రద్దు చేసుకొన్నారు. ఈ సారి సభ నిర్వహించి బీజేపీకి ఖమ్మంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా బలం లేదని ఢిల్లీ పెద్దల ముందు స్వయంగా నిరూపించుకొన్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
రైతు డిక్లరేషన్ అంతా వట్టిదే!
ఖమ్మం సభ వేదికగా బీజేపీ రైతు డిక్లరేషన్ ప్రకటిస్తామని బీజేపీ నేతలు ఊదరగొట్టారు. కానీ సభలో ఎక్కడా కనీసం దాని ప్రస్తావనే లేదు. వాస్తవానికి రైతులకు ఏం చెప్పాలో కూడా బీజేపీ నేతలకు తెలియలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేలు పంట పెట్టుబడి ఇస్తూ, సమయానికి సరిపడా విత్తనాలు, ఎరువులు ఇస్తూ, ఉచితంగా సాగునీరు అందిస్తూ, పంట పండిన తర్వాత గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నారు. రైతు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నారు. ఏఈవోలు, రైతుబంధు సమితి వ్యవస్థ, రైతు వేదికలు రైతులకు దన్నుగా ఉంటున్నాయి. రైతు రుణమాఫీ పూర్తయింది. కరువుకు కేరాఫ్‌గా ఉన్న నేలలోనే తొమ్మిదేండ్లలో వ్యవసాయ రంగం కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించింది. ఇంతకుమించి రైతులకు ఏమని హామీ ఇవ్వాలో బీజేపీకి అర్థం కాలేదు. ఏది ప్రకటించినా.. ముందు కేంద్రంలో అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. అందుకే కనీసం రైతులకు ఏమిస్తారో కూడా చెప్పకుండా బీజేపీ తోకముడిచిందని నిపుణులు పేర్కొంటున్నారు.
చేరికలు హుష్ కాకి
అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని కొన్ని రోజులుగా కాషాయ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఖమ్మంతోపాటు అనేక మందికి అమిత్ షా బీజేపీ కండువా కప్పుతారని చెప్పుకొచ్చారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. చేరికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ మరోసారి ఫెయిల్ అయ్యారు. ఒక్క చేరిక కూడా లేక పార్టీ శ్రేణులే ఉసూరుమన్నాయి.